వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లాలో 71 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలపై కసరత్తు ఓటర్ల జాబితా రూపకల్పనకు అధికారుల సన్నద్ధత..
- ఈ-కేవైసీకి ప్రత్యేక ప్రాధాన్యం పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల సందడి మొదలవుతోంది.
- దాదాపు 13 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించే దిశగా అధికార యంత్రాంగం ప్రాథమిక చర్యలను వేగవంతం చేస్తోంది.
నెల్లూరు జిల్లాలో 71 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలపై కసరత్తు
ఓటర్ల జాబితా రూపకల్పనకు అధికారుల సన్నద్ధత.. ఈ-కేవైసీకి ప్రత్యేక ప్రాధాన్యం
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
నెల్లూరు జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల సందడి మొదలవుతోంది. దాదాపు 13 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించే దిశగా అధికార యంత్రాంగం ప్రాథమిక చర్యలను వేగవంతం చేస్తోంది. 2013లో చివరిసారిగా ఎన్నికలు జరగ్గా, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించకపోవడంతో సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికలపై రైతులు, సభ్యులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
నెల్లూరు జిల్లాలో మొత్తం 71 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండగా, వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై జిల్లా సహకార శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జిల్లా సహకార శాఖ అధికారి బి. గురుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో అనుసరించాల్సిన నిబంధనలు, విధివిధానాలు, అధికారుల బాధ్యతలపై సంబంధిత సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఓటర్ల జాబితా తయారీపై ప్రత్యేక దృష్టి
సహకార సంఘాల సభ్యులందరికీ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయించడం, సభ్యత్వ వివరాలను డేటాబేస్లో సమగ్రంగా నమోదు చేయడం అత్యంత కీలకమని అధికారులు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పన, ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర అంశాలపై సీఈఓలు, సంబంధిత సిబ్బందికి శిక్షణ అందించారు.
ఎన్నికల కోసం ఎదురుచూపులు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలకు సంబంధించిన ఎన్నికల అంశాలపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు కొనసాగుతుండటంతో తదుపరి ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. అధికారిక నోటిఫికేషన్ వెలువడితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరింత స్పష్టత రానుంది.
దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత సహకార సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఆయా సంఘాలపై పట్టు సాధించేందుకు రాజకీయ వర్గాలు కూడా సమీకరణాలు ప్రారంభించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికలు సహకార రంగంలో కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేస్తాయా అన్నది వేచి చూడాలి.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్