చుంచుపల్లి, సెప్టెంబర్ 28: చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)ను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన స్థాయి, బోధనా ప్రమాణాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. వివిధ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలపై వారి అవగాహనను తెలుసుకున్నారు.
పదో తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. సరైన సమాధానం లేకపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పదో తరగతి ఫలితాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వైద్య సేవలు, ఓపీ రోగుల వివరాలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు, ల్యాబొరేటరీ సేవలను సమీక్షించారు. ప్రతిరోజూ 50 నుంచి 60 మంది వరకు ఓపీకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోగులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్టోర్ రూమ్లో మందుల నిల్వలను తనిఖీ చేసి గడువు తేదీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, గడువు ముగిసిన మందులను నిబంధనల ప్రకారం తొలగించాలని ఆదేశించారు. ల్యాబొరేటరీలో మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అవసరమైన పరీక్షా కిట్లు, మందులను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సిబ్బంది విధులకు సక్రమంగా హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో సేవల నాణ్యతను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో తహసీల్దార్ నాగరాజు, ఎంఈఓ నీరజ, పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి, నర్సులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
