Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

హాకింపేట్ అడ్మిషన్ల డీల్‌ రూ.8 లక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హాకింపేట్ అడ్మిషన్ల డీల్‌ రూ.8 లక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • హాకింపేట్ అడ్మిషన్ల డీల్‌ రూ.8 లక్షలు..!
  • ఒక్కో సీటుకు రూ.50 వేలు..
  • ముందస్తుగా రూ.20 వేల నుంచి రూ.40 వేల వసూళ్లు..

హాకింపేట్ అడ్మిషన్ల డీల్‌ రూ.8 లక్షలు..!

ఒక్కో సీటుకు రూ.50 వేలు.. ముందస్తుగా రూ.20 వేల నుంచి రూ.40 వేల వసూళ్లు.. 18 మంది నుంచి రూ.3 నుంచి 4 లక్షల వసూళ్లు.. ఓ గ్రామ ప్రజాప్రతినిధి భర్త పాత్రపై ప్రచారం!

మహబూబాబాద్ :

పేద, గ్రామీణ కుటుంబాల పిల్లలకు మెరుగైన క్రీడా శిక్షణతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్‌ (హాకింపేట్‌)లో నాలుగో తరగతి ప్రవేశాల పేరుతో డబ్బుల వసూళ్లు వ్యవహారం మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు ఒక్కో సీటుకు రూ.50 వేల వరకు డీల్ కుదుర్చుకుని, ముందస్తుగా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఫోన్ పే ద్వారా వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా సుమారు 18 సీట్లకు గాను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటి వరకు సీట్లు రాకపోవడంతో బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, నిర్దిష్టంగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఫోన్‌పే లావాదేవీలు, బ్యాంక్ పేమెంట్లు, వాట్సాప్ రికార్డులు బాధితుల వద్ద ఉన్నట్లు సమాచారం.

1:3లో మీ పేరు ఉంటుందని నమ్మించి..!

మండల, జిల్లా స్థాయిలో 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల్లో మీ పిల్లల సీటు ఇప్పిస్తామని దళారులు నమ్మించినట్లు సమాచారం. ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్స్‌ సర్కిల్‌లో నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, క్రీడా శిక్షణ అందుతుండటంతో పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలంటే వేల లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పొందేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే కొంతమందిని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరంలో సగం గడుస్తున్నా సీట్లు లభించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంలో సుమారు 18 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తుండగా, వాస్తవంగా ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు? ఎంత మొత్తం చేతులు మారింది? సీట్లు ఇప్పిస్తామని చెప్పిన వారి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై తేలాల్సి ఉంది.

డ్రాప్ అవుట్ సీట్ల దందాలో కీలక పాత్ర..!

వివిధ కారణాలతో అప్పటికే పాఠశాల నుంచి మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థుల స్థానంలో ఖాళీ అయ్యే సీట్లను ఆసరాగా చేసుకుని దళారులు ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల పాత్రపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.

ఓ గ్రామ ప్రజాప్రతినిధి భర్త పాత్రపై ప్రచారం..!

జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి భర్త ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం సాగుతోంది. స్పోర్ట్స్ స్కూల్‌లో సీట్లు ఇప్పిస్తామని పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. అయితే తాను తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

హాకింపేట్ సీట్ల వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

హాకింపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో సీట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రీడా శిక్షణ అందించాల్సిన ప్రభుత్వ సంస్థల్లో ఇలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించి, నిజానిజాలను వెలికితీసి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *