వార్త ముఖ్యాంశాలు
- ముఖ్యమంత్రి సభలకు, ఇతర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సాధారణ ప్రయాణికులు ఉపయోగించే ఆర్టీసీ బస్సులను రద్దు చేసి తరలించడాన్ని వెంటనే నిలిపివేయాలని, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నంద్యాల జిల్లాకు నూతన బస్సులను కేటాయించి బస్సుల సంఖ్యను పెంచాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్.
- రంగ నాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫకృద్దీన్ డిమాండ్ చేశారు.
- గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు.
ముఖ్యమంత్రి సభలకు, ఇతర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సాధారణ ప్రయాణికులు ఉపయోగించే ఆర్టీసీ బస్సులను రద్దు చేసి తరలించడాన్ని వెంటనే నిలిపివేయాలని, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నంద్యాల జిల్లాకు నూతన బస్సులను కేటాయించి బస్సుల సంఖ్యను పెంచాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫకృద్దీన్ డిమాండ్ చేశారు. గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. గతంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలపై కూడా ఆధారపడేవారని, అయితే ఉచిత బస్సు విధానం రాకతో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులకు గిట్టుబాటు కాక వారు ఇతర ఉపాధి మార్గాలను చూసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో ప్రస్తుతం సాధారణ ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలంతా సంపూర్ణంగా ఆర్టీసీ సేవలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. అయితే నంద్యాల జిల్లాలోని పలు డిపోల్లో అనేక బస్సులు ఫిట్నెస్ లేక, ఉన్న బస్సుల సంఖ్యను కూడా అధికారులు రోజురోజుకూ కుదిస్తుండటంతో ప్రయాణికులకు తీవ్ర రవాణా కష్టాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు సమయానికి బస్సులు రాక గంటల తరబడి బస్టాండ్లలో నిరీక్షించాల్సి వస్తోందన్నారు. విద్యార్థులు సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సీఎం, మంత్రుల సభలకు లేదా అధికారిక కార్యక్రమాలకు వందలాది ఆర్టీసీ బస్సులను రూట్ల నుంచి రద్దు చేసి తరలించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సామాన్య ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టి ప్రభుత్వ సభలకు బస్సులను మళ్లించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీఎం సభలకు ఆర్టీసీ బస్సులను తరలించే విధానానికి స్వస్తి పలకాలని, నంద్యాల జిల్లాలోని డిపోలకు పాత బస్సుల స్థానంలో నూతన బస్సులను కేటాయించి, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులను పెంచి రవాణా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.