వార్త ముఖ్యాంశాలు
- ముధోల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
- నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి మొత్తం రూ.5 కోట్ల 90 లక్షల 18 వేల నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.
- తానూరు మండలంలోని భామ్ని గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2 కోట్ల 87 లక్షల 98 వేల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ముధోల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి మొత్తం రూ.5 కోట్ల 90 లక్షల 18 వేల నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. తానూరు మండలంలోని భామ్ని గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2 కోట్ల 87 లక్షల 98 వేల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే కుబీర్ మండలంలోని వాయి లింగి గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.3 కోట్ల 2 లక్షల 20 వేల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
లో-వోల్టేజీ సమస్య కారణంగా ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. గత నెల 11న సంబంధిత శాఖ మంత్రిని కలిసి సమస్యను వివరించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. తన విజ్ఞప్తికి వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత మంత్రులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడంతో పాటు రైతులకు ఎదురవుతున్న లో-వోల్టేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.