ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, జులై 20, పున్నమి ప్రతినిధి: ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హరిబౌలీలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ జీవన విధానం, పల్లె సంస్కృతి, సాంప్రదాయాలను, ఇక్కడి ప్రజల స్ఫూర్తిని చాటి చెప్పే గొప్ప ఉదాహరణలు అని అన్నారు.
జంట నగరాల్లో రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 కోట్లు కేటాయించామని, నగరంలోని 2783 ఆలయాలకు చెక్కుల రూపంలో నిధులను అందజేసినట్లు ప్రకటించారు. కేవలం ఒక ప్రకటన కాదనీ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేసే దృఢ సంకల్పం అని అన్నారు. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో, ఐటీ, పరిశ్రమల రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


