వార్త ముఖ్యాంశాలు
- ప్రజాసేవకు ఆయన జీవితం ఆదర్శం: కలెక్టర్ హిమాన్షు శుక్లా పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన ఎస్.ఆర్.
- శంకరన్ ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.
- ఆయన జయంతిని పురస్కరించుకుని గురువారం విడుదల చేసిన ప్రకటనలో సేవలను స్మరించుకున్నారు.
ప్రజాసేవకు ఆయన జీవితం ఆదర్శం: కలెక్టర్ హిమాన్షు శుక్లా
పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని గురువారం విడుదల చేసిన ప్రకటనలో సేవలను స్మరించుకున్నారు. అధికారం ప్రజల సమస్యలను పరిష్కరించే సాధనమని శంకరన్ తన ఆచరణతో చూపించారని తెలిపారు.
సామాన్య కుటుంబంలో జన్మించి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన శంకరన్, నెల్లూరు కలెక్టర్‌తోపాటు పలు కీలక బాధ్యతలు నిర్వహించారని వివరించారు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ సాధారణ జీవనాన్ని కొనసాగించారని, ప్రతి వ్యక్తి శ్రమను గౌరవించారని పేర్కొన్నారు. అగర్తలాలో రిక్షా కార్మికుడి సమయానికి విలువనిస్తూ వ్యవహరించిన సంఘటన ఆయన మానవీయ దృక్పథానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
పదవీ విరమణ తర్వాత కూడా పేదల హక్కుల కోసం పనిచేశారని, తన పెన్షన్‌లో కొంత మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమానికి అందించారని తెలిపారు. సామాజిక సమస్యలకు శాంతియుత పరిష్కారాలు లభించేలా ప్రయత్నించారని గుర్తుచేశారు.
నెల్లూరు కలెక్టరేట్లోని ‘శంకరన్ హాల్’ ఆయన సేవాస్ఫూర్తిని గుర్తుచేస్తోందన్నారు. నిజాయితీ, నిరాడంబరత, బాధ్యతాయుతమైన పనితీరు ప్రతి అధికారికి మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, పారదర్శకంగా వ్యవహరించడమే శంకరన్‌కు అందించే నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన చూపిన సేవామార్గాన్ని ప్రభుత్వ ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పేదల పట్ల అంకితభావంతో పనిచేసిన ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని, ఆ విలువలు నేటికీ సమాజానికి అవసరమని కలెక్టర్ వివరించారు.