దేశ అభివృద్ధిలో నెహ్రూ కృషి అమోఘం: సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చలసాని
గాజువాక, నవంబర్ 14 (పున్నమి ప్రతినిధి): భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలోనే బలమైన పునాదులు పడ్డాయని, ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపనకు ఆయన విశేష కృషి చేశారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చలసాని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం గాజువాక లయన్స్ క్లబ్‌లో ‘ప్రభుత్వ రంగ పరిశ్రమలు – పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కృషి’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ, నెహ్రూ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే సమయానికి దేశం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. ఆయన పాలనలో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు.
బార్క్, డీఆర్‌డీఓ వంటి శాస్త్రసాంకేతిక సంస్థలు, ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి విద్యాసంస్థలు, ఎయిమ్స్ వంటి వైద్య సంస్థల ఏర్పాటుతో పాటు నాగార్జునసాగర్, భాక్రానంగల్ వంటి భారీ సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నెహ్రూ హయాంలో పునాదులు పడ్డాయని వివరించారు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి ఏ.జె. స్టాలిన్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన నెహ్రూ దేశ పారిశ్రామిక ప్రగతికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి. ఆదినారాయణ మాట్లాడుతూ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌తో పాటు పలు ఉక్కు పరిశ్రమల ఏర్పాటులో నెహ్రూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రెహమాన్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో నెహ్రూ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువరని అన్నారు.
ఈ సదస్సులో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాశిరెడ్డి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు మన్మథరావు, కె. వనజాక్షి, స్టీల్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జె. అయోధ్యరామ్, సీపీఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం. రాంబాబు, పౌరహక్కుల సంఘం నాయకులు తుంపాల శ్రీరామ్మూర్తి, సీపీఐ నాయకులు అప్పారి విష్ణుమూర్తి, ఎం.ఎస్. అప్పారావు, ఎల్లేటి శ్రీనివాస్, పి. దుర్గారావు, కె. పోతయ్య, పిల్లా పద్మ, జె. రామకృష్ణ, టి. సాంబమూర్తి, కె. అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.
