Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కూటమిలో కొలిక్కి వచ్చిన సర్దుబాట్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు కూటమిలో కొలిక్కి వచ్చిన సర్దుబాట్లు

వార్త ముఖ్యాంశాలు

  • - కార్పొరేషన్ పరిధిలో జనసేనకు 8 డివిజన్లు - బీజేపీకి 6 డివిజన్లు - ప్రచారానికి కూటమి అభ్యర్థులు సమాయత్తం జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ఈ నెల 28న జరిగే కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల్లో ఎట్టకేలకు సర్దుబాట్లు ఓ కొలిక్కి వచ్చాయి.
  • కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలకు మొత్తం 14 సీట్లు ఇచ్చే విధంగా టీడీపీ ప్రధాన నేతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
  • బీజేపీతో పెద్దగా ఇబ్బందులు రాకపోయినా జనసేనతో మాత్రం టీడీపీ నేతలకు అనేకసార్లు చర్చోపచర్చలు జరిగాయి.

– కార్పొరేషన్ పరిధిలో జనసేనకు 8 డివిజన్లు
– బీజేపీకి 6 డివిజన్లు
– ప్రచారానికి కూటమి అభ్యర్థులు సమాయత్తం

జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ఈ నెల 28న జరిగే కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల్లో ఎట్టకేలకు సర్దుబాట్లు ఓ కొలిక్కి వచ్చాయి. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలకు మొత్తం 14 సీట్లు ఇచ్చే విధంగా టీడీపీ ప్రధాన నేతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బీజేపీతో పెద్దగా ఇబ్బందులు రాకపోయినా జనసేనతో మాత్రం టీడీపీ నేతలకు అనేకసార్లు చర్చోపచర్చలు జరిగాయి.

జనసేనకు సంబంధించి రాష్ట్రం నుంచి పరిశీలకులుగా వచ్చిన శివశంకర్ ఒక దశలో పొత్తు ఉండదని, తాము 30 శాతం స్థానాలకు స్నేహపూర్వక పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. తొలుత పరిశీలకులుగా వచ్చిన శివశంకర్ స్థానిక నేతలతో కలిసి ఉన్న 72 డివిజన్లలో 30 శాతం డివిజన్లను తమ జనసేన పార్టీకి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. దీనికి టీడీపీ నేతలు ససేమిరా అంగీకరించలేదు.

జనసేన నేతలు మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కె. శ్రీధర్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర తదితరులతో పలుమార్లు చర్చలు జరిపినా అవి ఫలించలేదు. చివరకు కార్పొరేషన్ పరిధిలో 12 స్థానాలను కేటాయించమని కోరినా దానికి కూడా టీడీపీ నేతలు అంగీకరించలేదు. ఈ దశలో జనసేన పరిశీలకులుగా వచ్చిన శివశంకర్ మీడియా ముందుకు వచ్చి తమకు పొత్తు కుదరలేదని, స్నేహపూర్వకంగా 30 శాతం స్థానాల్లో పోటీ చేస్తామని సైతం ప్రకటించారు.

ఈ దశలో ఆయన నగరంలో విడిది చేసి ఉన్న ఓ హోటల్‌లోకి వారి పార్టీకే చెందిన ఓ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి వచ్చి నానా యాగీ చేశారు. ఇలా సర్దుబాట్లు చేసుకోకుంటే ఎలా? 30 శాతం కావాలని పట్టుబడితే ఎలా? ఇచ్చినవరకు తీసుకుంటే ఇచ్చిన సీట్లన్నీ గెలుస్తాం కదా! అలా కాకుండా 30 శాతం పోటీ చేస్తే సీట్లు రాకపోతే ఎలా? అని నానా యాగీ చేయడం జరిగిందని తెలియవస్తోంది.

ఈ దశలో ఆలోచనలో పడ్డ జనసేన వారు మరోసారి ఫైనల్‌గా టీడీపీ నేతలతో సర్దుబాట్ల చర్చలు జరపడంతో వారికి 8 సీట్లు ఇచ్చేలా ఖరారు ఒప్పందం చేసుకున్నారు. దీంతో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. జనసేనకు సిటీలో నాలుగు సీట్లు కేటాయించారు. అవి వరుసగా 6, 15, 21, 71లు. అలాగే రూరల్‌లో నాలుగు స్థానాలు జనసేనకు కేటాయించగా అవి వరుసగా 29, 30, 45, 53 డివిజన్లుగా ఉన్నాయి.

ఇక సిటీలో బీజేపీకి 7, 13, 60 డివిజన్లు కేటాయించగా, రూరల్‌లో బీజేపీకి 31, 42, 43 డివిజన్లను కేటాయించారు. దీంతో పొత్తులు, సర్దుబాట్లు తేలిపోవడంతో కూటమి అభ్యర్థులు ఎన్నికల సమరానికి సిద్ధమై ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు.

జనసేనలో నైరాశ్యం

కాగా, జరిగిన ఈ సర్దుబాట్లలో టీడీపీ ఏ మాత్రం తగ్గకపోగా జనసేనే తగ్గాల్సి వచ్చిందని జనసేన నేతల్లో నైరాశ్యం కనిపిస్తోంది. ఉన్న 72 డివిజన్లలో 30 శాతం డివిజన్లను తొలుత తమ పార్టీ డిమాండ్ చేసిందని, సరే పొత్తు ధర్మం కనుక తానే తగ్గి 12 సీట్లకు దిగివచ్చి అడిగినా ఆ 12ను కూడా ఇవ్వకుండా కేవలం 8 సీట్లకు పరిమితం చేయడం అంటే తమను, తమ పార్టీని చులకన చేయడమే అన్న అభిప్రాయాన్ని జనసేన నేతలు వ్యక్తపరుస్తున్నారు.

2024లో జరిగిన ఎన్నికల్లో తాము కార్పొరేషన్ పరిధిలో నిలబడ్డ టీడీపీ అభ్యర్థులకు ఎగిరెగిరి పనిచేశామని, నిస్వార్థంగా పనిచేసిన తమకు ఏం మిగిలిందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2, 20 డివిజన్లలో ఈ అభిప్రాయాలు ఎక్కువగా వినవస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *