వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
నర్స్‌పై అత్యాచారం.. హత్య!
30 గంటల్లో నిందితుడి అరెస్ట్.. పహాడీషరీఫ్ పోలీసుల దర్యాప్తులో కీలక వివరాలు
తుక్కుగూడ ప్రైమ్ కేర్ ఆసుపత్రి క్వార్టర్స్‌లో దారుణం
21 ఏళ్ల నర్సును హత్య చేసి అత్యాచారం చేసినట్లు పోలీసుల వెల్లడి
తుక్కుగూడ, ఆగస్టు 31:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తుక్కుగూడ ప్రైమ్ కేర్ హాస్పిటల్ నర్స్ హత్యాచారం కేసులో పహాడీషరీఫ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదు అందిన సుమారు 30 గంటల్లోనే కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, దర్యాప్తులో లభించిన కీలక సమాచారంతో **ఎండీ సనావుల్లా (34)**ను 30.08.2026 సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
కిటికీ నుంచి గదిలోకి ప్రవేశించి..
పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన సనావుల్లా తుక్కుగూడలోని ఓ బైక్ మెకానిక్ షాప్‌లో పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. సుమారు నెల రోజులుగా మృతురాలిని గమనిస్తూ ఆమెపై లైంగిక కోరిక పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఆగస్టు 28/29 అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో కిటికీ ద్వారా నర్సు గదిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు కేకలు వేయడంతో నిందితుడు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగినట్లు వెల్లడించారు.
ప్రతిఘటించిన నర్సు.. దాడికి పాల్పడిన నిందితుడు
మృతురాలు నిందితుడి చేతికి కొరకడంతో పాటు గొంతు, ఛాతీపై గోళ్లతో గీరినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడి, కిటికీని మూసివేసి అక్కడి నుంచి పరారైనట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
ఉదయం బయటకు రాకపోవడంతో అనుమానం
ఆగస్టు 29న ఉదయం నుంచి మృతురాలు గది నుంచి బయటకు రాకపోవడంతో ఆమె స్నేహితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. కిటికీ ద్వారా గదిలోకి చూడగా ముఖంపై రక్తగాయాలతో ఆమె మృతి చెంది కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల అదుపులో నిందితుడు
ఈ కేసులో క్రైమ్ నంబర్ 554/2026 నమోదు చేసి BNS 103(1), 64(1), 332(a) సెక్షన్లతో పాటు SC/ST (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(ii)(V) కింద కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి శామ్‌సంగ్ మొబైల్ ఫోన్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణ, విశ్లేషణ కొనసాగుతోందన్నారు.
పోలీసుల వేగవంతమైన దర్యాప్తు
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ పర్యవేక్షణలో, శంషాబాద్ జోన్ డీసీపీ బి. రాజేష్, ఆర్‌జీఐఏ డివిజన్ ఏసీపీ వి. శ్రీకాంత్ గౌడ్ మార్గదర్శకత్వంలో పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ బి. లక్ష్మీనారాయణ రెడ్డి బృందం, శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కలిసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Uploaded Video:
