Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నగరంలో ఇష్టారాజ్యంగా సీసీ రోడ్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నగరంలో ఇష్టారాజ్యంగా సీసీ రోడ్లు

వార్త ముఖ్యాంశాలు

  • - అడ్రస్‌ లేని మార్జిన్లు, సైడ్‌ వాల్స్‌ - పటిష్ఠత కరువు - భద్రత బరువు - పట్టించుకునే దిక్కులేని కార్పొరేషన్‌ - పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ దుస్థితి - లక్షలు ఖర్చు చేస్తున్నా పూర్తికాని లక్ష్యాలు - మంత్రి దృష్టికి పోని ఇలాంటి ఘటనలు -…
  • సీసీ రోడ్లు వేసిన తర్వాత సంబంధిత రోడ్లకు వేయాల్సిన మార్జిన్లు కానీ, కట్టాల్సిన సైడ్‌ వాల్స్‌ కానీ నిర్మించకుండానే గాలికి వదిలేస్తున్నారు.
  • దీంతో ఆయా సీసీ రోడ్ల పటిష్ఠత ప్రశ్నార్థకంగా మారుతోంది.

– అడ్రస్‌ లేని మార్జిన్లు, సైడ్‌ వాల్స్‌
– పటిష్ఠత కరువు
– భద్రత బరువు
– పట్టించుకునే దిక్కులేని కార్పొరేషన్‌
– పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ దుస్థితి
– లక్షలు ఖర్చు చేస్తున్నా పూర్తికాని లక్ష్యాలు
– మంత్రి దృష్టికి పోని ఇలాంటి ఘటనలు
– క్షేత్రస్థాయిలో ఇంజినీర్ల ఇష్టారాజ్యం
– మామూళ్లకే ప్రాధాన్యం

నెల్లూరు నగరంలో సీసీ రోడ్ల నిర్మాణం ఇష్టారాజ్యంగా జరుగుతోంది. సీసీ రోడ్లు వేసిన తర్వాత సంబంధిత రోడ్లకు వేయాల్సిన మార్జిన్లు కానీ, కట్టాల్సిన సైడ్‌ వాల్స్‌ కానీ నిర్మించకుండానే గాలికి వదిలేస్తున్నారు. దీంతో ఆయా సీసీ రోడ్ల పటిష్ఠత ప్రశ్నార్థకంగా మారుతోంది. నాణ్యత, మన్నిక కరువై, అతి త్వరలోనే ఆ సీసీ రోడ్లు కుంగి, పక్కలు విరిగి ముక్కలయ్యే ప్రమాదం ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఇంజినీర్లు సంబంధిత కాంట్రాక్టర్లతో కుమ్మక్కై, వారు ఇచ్చే పర్సంటేజీలు, మామూళ్లకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులను అగమ్యగోచరంగా మార్చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి దృష్టికి ఇలాంటి ఘటనలు వెళ్లడం లేదని, తెలిస్తే మంత్రి ఊరుకోరన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాజాగా పాత 4వ డివిజన్‌ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో అటు మైపాడు రోడ్డుకు, ఇటు జాకీర్‌ హుస్సేన్‌నగర్‌ ప్రధాన రోడ్డుకు మధ్య లక్షల రూపాయలు ఖర్చు చేసి రెండు సీసీ రోడ్లు వేశారు. అయితే ఈ రోడ్లను పక్కనున్న భూమి కంటే మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో, అప్పటికప్పుడు తోలిన రబ్బిష్‌, వదులైన మట్టిపై నిర్మించారు. ఈ రోడ్లకు రెండు వైపులా మార్జిన్లు అసలే లేవు. సరే, కనీసం సైడ్‌ వాల్స్‌ అయినా నిర్మించారా అంటే అదీ లేదు.

ఇంజినీరింగ్‌ నియమ నిబంధనలను పక్కనపెట్టి, పటిష్ఠత, మన్నిక గురించి ఆలోచించకుండానే ‘దున్న ఈనిందంటే గాటన కట్టేయమన్న’ సామెత చందంగా లక్షలు ఖర్చు చేసి రోడ్లను ఇష్టారాజ్యంగా వేసేశారు. ఆ తర్వాతైనా ఈ రోడ్ల గురించి పట్టించుకున్నారా అంటే అదీ లేదు. నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి ఈ విధంగా ఘోరంగా తయారవుతోంది.

సంబంధిత ఇంజినీర్లు కాంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్లకు లోబడి ఇష్టారాజ్యంగా బిల్లులు చేసేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ప్రజాధనమే కదా! మనకు వచ్చిన నష్టమేంటి? మంత్రి, కమిషనర్‌ వచ్చి చూస్తారా?’ అన్న నిర్లక్ష్యంతో ఇలాంటి రోడ్లను వేసేసి, చకచకా బిల్లులు చేసేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

సిటీ నియోజకవర్గం భూగర్భ మురుగునీటి పారుదల (యూజీడీ), మినరల్‌ వాటర్‌ పథకాల పరిధిలో ఉంది. మరికొద్ది రోజులు లేదా నెలల్లోనే కొత్తగా వేసిన ఈ సీసీ రోడ్ల మీదుగా యూజీడీ, మినరల్‌ వాటర్‌ పథకాల పైపులైన్లు వచ్చే అవకాశం ఉంది. ఆ పథకాలను ఈ వీధుల్లో అమలు చేయాలంటే మళ్లీ ఈ రోడ్లను పగలగొట్టాల్సి వస్తుంది. ఇంజినీర్లు ముందుచూపు లేకుండా, సీసీ రోడ్ల కింద యూజీడీ, మినరల్‌ వాటర్‌ పథకాలకు సంబంధించిన పైపులు వేయకుండానే ఇష్టారాజ్యంగా రోడ్లు వేసేస్తున్నారు.

నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో ముందుచూపు లేకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఏట్లో పోసినట్లవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం నగర పర్యటనలు, ఆకస్మిక తనిఖీలంటూ ఫొటోలకు పోజులిచ్చే కమిషనర్‌ వై.ఓ. నందన్‌ కంటికి ఇలాంటి మార్జిన్లు, సైడ్‌ వాల్స్‌ లేని సీసీ రోడ్లు కనిపించవా? భవిష్యత్తులో వేయాల్సిన యూజీడీ, మినరల్‌ వాటర్‌ పైపులైన్ల గురించి ఆలోచన రాదా? అని నగర ప్రజలు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.

మంత్రి నారాయణ ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నెల్లూరులో అభివృద్ధి పనులు చేయిస్తున్నప్పటికీ, ఆ పనులు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతున్నాయి? సక్రమంగా జరుగుతున్నాయా? అక్రమాలు చోటుచేసుకుంటున్నాయా? అనే అంశాలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే మంత్రి చేపడుతున్న అభివృద్ధి నెల్లూరు నగరంలో బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికైనా సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ, కమిషనర్‌ వై.ఓ. నందన్‌ క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రదేశాలను పరిశీలించి, ఇంజినీర్ల పనుల్లోని లోపాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అప్పుడే ప్రజల విమర్శల జడివాన నుంచి బయటపడగలుగుతారని, లేకపోతే వారు చేస్తున్న అభివృద్ధి ‘గుడ్డెద్దు చేలో పడి మేసినట్లే’ అవుతుందని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *