ధర్మసాగర్ చెరువు ఆక్రమణలపై కలెక్టర్ స్పందన
రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ EEకి ఆదేశం: సయ్యద్ హైదర్
పత్రికా మిత్రులకు
ఆమ్ ఆద్మీ పార్టీ – నిర్మల్ జిల్లా
తేదీ: 24-08-2026 | స్థలం: నిర్మల్
నిర్మల్ పట్టణంలోని చారిత్రాత్మక ధర్మసాగర్ చెరువు FTL, బఫర్ జోన్ ఆక్రమణలు, అలాగే చెరువు గర్భంలో అక్రమంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ సమర్పించిన అప్పీల్‌పై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ తెలిపారు.
ఈరోజు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజావాణి) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు నేరుగా అప్పీల్ సమర్పించిన అనంతరం సయ్యద్ హైదర్ విలేకరులతో మాట్లాడారు.
గతంలో ప్రజావాణి ద్వారా ధర్మసాగర్ చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు చేయగా, ఇరిగేషన్ అధికారులు నిర్దిష్ట వివరాలతో సమాధానం ఇవ్వకుండా 17 చెరువుల జాబితాను పంపి అసలు అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా నివేదిక సమర్పించారని ఆయన ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ సమర్పించినట్లు తెలిపారు.
అప్పీల్‌ను స్వీకరించిన జిల్లా కలెక్టర్, ధర్మసాగర్ చెరువు FTL ఆక్రమణలు, బఫర్ జోన్ పరిస్థితి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి రెండు వారాల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE)ను ఆదేశించినట్లు సయ్యద్ హైదర్ వెల్లడించారు.
ప్రధాన డిమాండ్లు:
ధర్మసాగర్ చెరువు FTLను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే చేయాలి.
చెరువు బఫర్ జోన్‌లో జరిగిన ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
చెరువు గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్‌పై సమగ్ర విచారణ చేపట్టాలి.
అక్రమ నిర్మాణం నిర్ధారణ అయితే వాకింగ్ ట్రాక్‌ను తొలగించాలి.
గతంలో సమర్పించిన నివేదికపై కూడా సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు నిర్ణీత రెండు వారాల గడువులో సమగ్ర నివేదిక సమర్పించాలని సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. గడువులోగా నివేదిక ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
