Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

తుఫాను దెబ్బకు అన్నదాత అతలాకుతలం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తుఫాను దెబ్బకు అన్నదాత అతలాకుతలం!

వార్త ముఖ్యాంశాలు

  • నేలకొరిగిన వరి..
  • దెబ్బతిన్న మిర్చి..
  • నీట మునిగిన పంటలు నష్టాల భారంతో కుంగిపోతున్న రైతులు..

నేలకొరిగిన వరి.. దెబ్బతిన్న మిర్చి.. నీట మునిగిన పంటలు

నష్టాల భారంతో కుంగిపోతున్న రైతులు.. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

మరిపెడ: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఎన్నో ఆశలతో అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాయి. చేతికొచ్చే సమయంలో వరి పంట నేలకొరిగి, పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మిర్చి పంటకు వేరు కుళ్లు తెగులు సోకడం, అధిక తేమ కారణంగా మొక్కలు దెబ్బతినడం వంటి సమస్యలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి.

వరి, మిర్చితో పాటు పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, ఇతర పంటలపై కూడా వర్షాల ప్రభావం పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు అన్నీ భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యం కారణంగా పంటలు దెబ్బతినడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదా?

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినప్పుడు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి గ్రామంలో పంట నష్టాన్ని అంచనా వేయాలి. దెబ్బతిన్న వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను పరిశీలించి పారదర్శకంగా నష్టం నమోదు చేయాలి.

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు తగిన పరిహారం అందించడంతో పాటు పంటల బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ రుణాల విషయంలోనూ రైతులకు వెసులుబాటు కల్పించాలి. అవసరమైన చోట వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించాలి.

రైతు కన్నీరు తుడవాల్సిన సమయం ఇదే!

ఒకవైపు పెట్టుబడుల భారం.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు.. ఇంకోవైపు అప్పుల ఒత్తిడితో అన్నదాతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నే నష్టాల పాలైతే అతడిని ఆదుకునేది ఎవరు? రైతు కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు రూపొందించి పరిహారం అందించే వరకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *