Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటి గొంతుకల కోవూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోటి గొంతుకల కోవూరు

వార్త ముఖ్యాంశాలు

  • -ఎర్ర జెండాలు ఎగిరిన నేల -ఉద్యమాలకు పురుడు పోసిన పోతుగడ్డ -పచ్చని మాగాణులకు నిలయం -మనసున్న మనుషుల ఆలయం -స్వేచ్ఛా వాయువుల సాగర తీరం -కలల అలలకు రెక్కలు తొడిగే నీలాకాశం -అరుణ పతాక ధగధగలు మెరిసిన ఆకాశం -ఎందరికో రాజకీయ భిక్ష పెట్టిన యవనిక -జాలువారే…
  • అభ్యుదయం చైతన్యాలు కలగలిపిన నియోజకవర్గమే కోవూరు.
  • కోటి గొంతుకల కోవూరు ఒకప్పుడు ఎర్ర జెండాలు ఎగిరిన నేల, అరుణ పతాక ధగధగలు మెరిసిన నేల తల్లి, స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన పుణ్యభూమి.

-ఎర్ర జెండాలు ఎగిరిన నేల
-ఉద్యమాలకు పురుడు పోసిన పోతుగడ్డ
-పచ్చని మాగాణులకు నిలయం
-మనసున్న మనుషుల ఆలయం
-స్వేచ్ఛా వాయువుల సాగర తీరం
-కలల అలలకు రెక్కలు తొడిగే నీలాకాశం
-అరుణ పతాక ధగధగలు మెరిసిన ఆకాశం
-ఎందరికో రాజకీయ భిక్ష పెట్టిన యవనిక
-జాలువారే జలాశయాల నేల తల్లి
-అభ్యుదయం చైతన్యాలు కలగలిపిన కోవూరు
-మేధావుల నిలయం అభ్యుదయాల ఆలయం
నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అభ్యుదయం చైతన్యాలు కలగలిపిన నియోజకవర్గమే కోవూరు. కోటి గొంతుకల కోవూరు ఒకప్పుడు ఎర్ర జెండాలు ఎగిరిన నేల, అరుణ పతాక ధగధగలు మెరిసిన నేల తల్లి, స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన పుణ్యభూమి. కోవూరు గురించి చెప్పాలంటే ఎంతో చరిత్ర ఉంది. తరం తరం నిరంతరం దశాబ్దాల చరిత్రకెక్కిన పుణ్యభూమి, పచ్చని పంట పొలాలతో పేరెన్నికగన్న రైతాంగంతో కర్షక, కార్మిక, శ్రామిక శక్తుల కలయికలతో అలరారిన నేల తల్లి కోవూరు. ఉద్యమాలకు పురిటిగడ్డై పోరుబాటలకు నిలయమై జాతీయ జీవన స్రవంతిలో ఓ వెలుగు వెలిగిన చారిత్రక ప్రదేశమే కోవూరు. కళలకు, కళాకారులకు, కవులకు, రచయితలకు పెట్టింది పేరు కోవూరు. ఎందరికో రాజకీయ భిక్ష పెట్టి వారికి కొత్త జీవితాలను ప్రసాదించి చట్టసభలలో అడుగు పెట్టించిన అజరామరమైన నేల తల్లే కోవూరు.
దక్షిణ భారత ఉద్యమ సూర్యుడిగా పేరుగాంచిన వామపక్షవాది పుచ్చలపల్లి సుందరయ్య జన్మించింది నియోజకవర్గంలోని విడవలూరు మండలం అలగానిపాడు. ఎర్ర సూర్యుడిగా పేరు పొంది తాడిత పీడిత ప్రజానీకానికి అండగా నిలిచిన సుందరయ్యకు జన్మనిచ్చిన మాతృభూమి కోవూరు. నేడు నెల్లూరులో పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల నిర్మాత రామచంద్రారెడ్డిది అలగానిపాడే. స్వాతంత్ర్యోద్యమంలో ఎన్నో సేవలు అందించిన బెజవాడ, మేనకూరు లాంటి కుటుంబాలకు నిలయమైన నియోజకవర్గమే కోవూరు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా దశాబ్దాలపాటు పనిచేసిన పందిళ్లపల్లి అరుణమ్మది కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం వావిళ్ల. ఐఎన్‌టీయూసీ నేతగా ఎదిగి ఎమ్మెల్సీగా పనిచేసిన చేనేత బిడ్డ బూదాటి రాధయ్యది కొడవలూరు మండలంలోని రామన్నపాలమే. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి లాంటి రాజకీయ దురంధరునికి రాజకీయ భిక్ష పెట్టిన నేల తల్లి కోవూరు.
కోవూరు నియోజకవర్గం అనగానే ఎందరో మేధావులు, చైతన్యవంతులు, ఆలోచనాపరులు చటుక్కున గుర్తుకొస్తారు. కవికోకిల దువ్వూరి రామిరెడ్డిది కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాలెం. ‘‘ఉండి తిన్నను లేక పస్తున్న గాని ఆశ చేయడు రైతు పరుల కష్టార్జితంబు’’ అని రైతు గురించి ఆకాశానికి ఎత్తి పల్లవించిన పల్లవే దువ్వూరి రామిరెడ్డి. ఇక వావిళ్లకు చెందిన ఎరమాకల ఆదిశేషారెడ్డి లాంటి కవులది విడవలూరు మండలం వావిళ్ల గ్రామమే. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లాంటి మహిళకు జిల్లాలో శాసనసభ స్థానం కల్పించిన నియోజకవర్గమే కోవూరు. అభ్యుదయ పోరాటాలు, దళితవాద తిరుగుబాట్లు, స్వేచ్ఛా వాయువుల కోసం పరితపించిన వీరులను కన్న తల్లి కోవూరు.
పచ్చపచ్చని మాగాణులకు, విరగపండే పంట పొలాలకు కొలువై నెలవైన నియోజకవర్గమే కోవూరు. కనిగిరి లాంటి రిజర్వాయర్ ఉన్నది నియోజకవర్గంలోని బుచ్చిలోనే. పైడేరు, మాలిదేవి వాగులు పొంగి ప్రవహించే ఉరకలు వేసే నీటితో జాలువారే నేలమ్మ కోవూరు. ఎక్కడో కర్ణాటకలో పుట్టి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి జిల్లాలోని వేలాది ఎకరాలను పంట పొలాలుగా మార్చి సాగు, తాగునీటిని అందించే పెన్నమ్మ ఈ నియోజకవర్గంలోని ఊటుకూరు వద్ద సాగర సంగమం చేరుతుంది. ఆక్వా పంటకు ప్రసిద్ధిగాంచి తీరంలో మెర్క్యురీ లైట్లతో మెరిపించే సాగర తీరానికి ఆయువుపట్టే కోవూరు నియోజకవర్గం. బకింగ్‌హామ్ కాలువ ఆనవాళ్లకు ఆటపట్టై, రామతీర్థం, ఊటుకూరు సాగర తీరాల వద్ద కనిపించే అందాల బ్రిటిష్ ఆనవాళ్లకు ప్రతిరూపమే కోవూరు. వృక్ష రూపంలో విలసిల్లే అయ్యప్ప స్వామి కి నెలవైన తుమ్మగుంట అయ్యప్ప క్షేత్రం ఉన్నది విడవలూరు మండలంలోనే , రాజకీయ ఉద్దండులకు పేరు గాంచిన కుటుంబాల నివాసాలు ఉన్నదీ బుచ్చిలోనే , బెజవాడ గోపాల్ రెడ్డి లాంటి స్వతంత్ర సమర యోధులకు జన్మను ఇచ్చిన బుచ్చి , కోవూరు నియోగాజకవర్గ పరిధిలోనే . కమ్యూనిస్టులకు దశాబ్దాల పాటు కంచు కోటగా నిలిచిన దామరమడుగు , రేబాల , యెల్లయ్యపాలెం , వావిళ్ళ గ్రామాలు నియోజకవర్గంలోనివే . అల్లూరు నియోజకవర్గ శాసన సభ్యులుగా పనిచేసిన కమ్యూనిస్ట్ దిగ్గజం స్వర్గీయ జక్కా వెంకయ్య ది నియోజకవర్గంలోని దామరమడుగు కావడం గమనార్హం .జిల్లాలోనే పేరు పొందిన మైపాడు రామతీర్థం సాగర బీచ్ లకు కోవూరే పట్టుకొమ్మ .
జొన్నవాడ, రామతీర్థం, గంగపట్నం లాంటి పుణ్యక్షేత్రాలకు నెలవైన నియోజకవర్గమే కోవూరు. నెల్లూరు జిల్లా కోనసీమగా పేరొందిన ఇందుకూరుపేట మండలం కోవూరు నియోజకవర్గంలోని అంతర్భాగమే. ఓ వైపు జాతీయ రహదారి, మరోవైపు రైల్వే మార్గం, సుదూరంగా సాగర తీరం కలిసి మెలిసి కనిపించే నియోజకవర్గమే కోవూరు. నాడు కమ్యూనిస్టు నుంచి ఆ మధ్యలో వైసీపీ నుంచి నేటి టీడీపీ వరకు ఎందరో నాయకులకు రాజకీయ చిరునామాలు అందించిన చైతన్యపు చిరుజల్లే కోవూరు. రైతు జీవితాలకు పెట్టింది పేరై కార్మిక, కర్షక ఉద్యమాలకు నెలవై కొలువైన కోటి గొంతుకల నియోజకవర్గమే కోవూరు.ఒకప్పుడు రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా పని చేసిన నేదురుమల్లి రాజ్య లక్ష్మి జన్మస్థలి కొడవలూరు మండలంలోని యెల్లాయపాలెమే .
తమలపాకు, అరటి పంటలకు ప్రసిద్ధిగాంచిన ఇనమడుగు, లేగుంటపాడు, వేగూరు, ముదివర్తి తదితర ప్రాంతాలు కోవూరు నియోజకవర్గంలోని అంతర్భాగాలే. పల్లవించిన పాటూరు చీరలకు చిరునామాగా ఉన్న పాటూరు కోవూరులోని అంతర్భాగమే. చేనేత, మత్స్యకారుల బిడ్డల పదధ్వనులతో, పాదస్పర్శలతో పునీతమైన నేల తల్లి కోవూరు. గీత, నేత కార్మికులకు ఆలవాలమే కోవూరు. ఒకప్పుడు చారిత్రాత్మకమైన మొలగొలుకులు పంటకు ప్రసిద్ధిగాంచిన మాగాణుల యవనికే కోవూరు. నల్లపరెడ్లకు సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నియోజకవర్గం కోవూరే. నాటి కాంగ్రెస్ హయాంలో పెళ్లకూరు రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తికి రాజకీయ జీవితం ఇచ్చి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన నేలమ్మ కోవూరు. సీఐటీయూ కార్మిక వర్గంలో దశాబ్దాలుగా కార్మిక అభ్యుదయానికి పని చేసిన నారు కృష్ణయ్య ది ప్రజా న్యాయవాదిగా ప్రజల కోసం కలం పట్టి న్యవది వృత్తిలో అలాగే ప్రజా సేవలో సర్పంచ్ గా అనేక సంవత్సరాలు ప్రజలకు నిస్వార్ధ విశిష్ట సేవలు అందించినా మలిరెడ్డి కృష్ణప్రసాద్ లది కోవూరు నీయొజ్జక వర్గంలోని విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామమే .
కోవూరు నియోజకవర్గంలో అంతర్భాగమైన ఇఫ్కో కిసాన్ సెజ్ ఉన్నది కొడవలూరు మండలం రాచర్లపాడు వద్దే. విద్యా నిలయంగా, విజ్ఞానుల నిలయంగా విశాల భారతావనిలో పేరు తెచ్చుకున్న విడవలూరు మండలం కోవూరు నియోజకవర్గ పరిధిలోనే ఉండటం కోవూరుకు ఎంతో తలమానికం. ఇలా ఎందరో మేధావులకు, సహజ వనరులకు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు, జలాశయాలకు, పచ్చని పంట పొలాలకు నెలవైన, కొలువైన కోటి గొంతుకల సముదాయమే కోవూరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *