మరిపెడ మండలంలో రైతుల కష్టాలు పట్టించుకునేదెవరు?
మరిపెడ, అక్టోబర్ 14: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలోని బురహాన్పురం గ్రామంలో విద్యుత్ సరఫరా, సాగునీటి సమస్యల కారణంగా మిర్చి పంటను కాపాడుకోలేక రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గ్రామానికి చెందిన రైతు బానోతు రామ్ సింగ్ మిర్చి పంటకు అవసరమైన నీరు అందకపోవడంతో పంటను వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం, సాగునీరు అందకపోవడంతో పంటకు నీరు పెట్టలేకపోతున్నామని రైతు వాపోతున్నాడు. ఇప్పటికే పంట సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతుకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరింత ఆర్థిక భారంగా మారాయి. కష్టపడి సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోయే పరిస్థితి రావడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు ఆవేదన
రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీరు అందిస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ గ్రామంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని బాధావత్ శివ కోరుతున్నాడు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ను సక్రమంగా అందించడంతో పాటు, సాగునీటి సమస్యను పరిష్కరించి మిర్చి పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
సంబంధిత అధికారులు బురహాన్పురం గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యుత్ మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని బానోతు రామ్ సింగ్ విజ్ఞప్తి చేస్తున్నాడు.
