Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కమ్ముకుంటున్న కరువు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కమ్ముకుంటున్న కరువు

వార్త ముఖ్యాంశాలు

  • - కనిపించని చినుకు జాడ - అడుగంటుతున్న జలాశయాలు - నార్లు పోసేందుకు సిద్ధం కాని రైతులు - సోమశిల, కండలేరులో తరిగిన నీటి నిల్వలు - నవంబర్ వచ్చినా వర్షాలు కరువే - ఆందోళనలో అన్నదాతలు - కానరాని కరువు మండలాల ప్రకటన - మెట్టలో…
  • - పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు - ఎండుతున్న పెన్నమ్మ పాయలు - ఎల్‌నినో ప్రభావమేనా?
  • నెల్లూరు జిల్లాను కరువు ప్రభావం కుదిపేస్తోంది.

– కనిపించని చినుకు జాడ
– అడుగంటుతున్న జలాశయాలు
– నార్లు పోసేందుకు సిద్ధం కాని రైతులు
– సోమశిల, కండలేరులో తరిగిన నీటి నిల్వలు
– నవంబర్ వచ్చినా వర్షాలు కరువే
– ఆందోళనలో అన్నదాతలు
– కానరాని కరువు మండలాల ప్రకటన
– మెట్టలో ఎక్కువైన బెట్ట
– రానున్న రోజుల్లో తాగునీటికి కరువేనా?
– పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు
– ఎండుతున్న పెన్నమ్మ పాయలు
– ఎల్‌నినో ప్రభావమేనా?
నెల్లూరు జిల్లాను కరువు ప్రభావం కుదిపేస్తోంది. నవంబర్ నెల వచ్చినా, విశాఖ కార్తె పెట్టినా చినుకు జాడ కనిపించడం లేదు. జిల్లాలోని జలాశయాలన్నీ నీరు లేక అడుగంటిపోతున్నాయి. జిల్లాలో ప్రధాన జలాశయాలైన సోమశిల, కండలేరులో అంతంతమాత్రంగానే నీటి నిల్వలు నమోదయ్యాయి. పెన్నమ్మలో చుక్క నీరు లేక ఇసుక పాయలు కనిపిస్తున్నాయి. పశుగ్రాసం కొరత ఎక్కువయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది.

నెల్లూరు జిల్లాలో సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో నార్లు పోసి, డిసెంబర్ నెల మొదటి వారం నుంచి నాట్లు వేయడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీ. ప్రస్తుతం ఆ ఆనవాయితీ రూపుమాసిపోతోంది. ఇప్పటివరకు జిల్లాలో లక్షలాది ఎకరాలకు నార్లు పోసే ప్రక్రియ మొదలు కాలేదు. అక్కడక్కడ బోర్ల కింద కొద్దికొద్దిగా నార్లు పోసినా, ఆ నార్లు పీకి నాట్లు వేసేదాకా నమ్మకాలు కనిపించడం లేదు. పొలాలు నెర్రెలు పారుతున్నాయి. రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నార్లు పోయగలమా, నాట్లు వేయగలమా, పంటలు పండే పరిస్థితులు ఉన్నాయా అన్న సందేహాలు వారిని పట్టిపీడిస్తున్నాయి.

కరువు మబ్బులు కమ్ముతున్నా, ఆ మబ్బుల్లోంచి ఒక చిన్న నీటి తుంపరి కూడా నేల రాలడం లేదు. సాధారణంగా నెల్లూరు జిల్లా రైతులు ‘ఏరు ముందా, ఏకాదశి ముందా?’ అంటూ ఒక సామెతను చెప్పుకుంటారు. ఏకాదశి ముందు వచ్చి వెళ్లిందే కానీ, ఏరు మాత్రం చుక్క నీరు లేకుండా కనిపిస్తోంది.

నెల్లూరు జిల్లా జలాశయాలకు నీరు వచ్చి చేరాలంటే ఎగువ భాగంలో ఉన్న కడప జిల్లాలో వర్షాలు కురవాలి. కానీ కడప గడపలో ఇప్పటివరకు చినుకు జాడే కనిపించడం లేదు. సోమశిల జలాశయానికి ఎగువన ఉన్న కడప జిల్లాలో వర్షాలు కురిస్తే, అక్కడి కొండలు, అడవుల్లో కురిసిన వర్షపు నీరంతా పెన్నమ్మను, దాని ఉపనదులను చేరి, పెన్నమ్మ పొంగి పరవళ్లతో నాట్యం చేస్తుంది. కానీ కడప జిల్లాలో నీటి చెమ్మ కూడా కనిపించడం లేదు. ఇక పెన్నమ్మకు నీరు వచ్చే దారేది?

శ్రీశైలం జలాశయం నుంచి నీటిని నింపుదామని ప్రభుత్వం ప్రయత్నించాలన్నా, అక్కడ కృష్ణమ్మకు వరదలు లేవు. కృష్ణమ్మకు కూడా ఈ ఏడు కష్టకాలం వచ్చింది. నీరు లేక కన్నీటితో కృష్ణమ్మ హతాశురాలై కనిపిస్తోంది. దీంతో శ్రీశైలం నుంచి పెన్నమ్మకు నీటిని తెచ్చే దారులన్నీ మూసుకుపోయాయి.

సోమశిల జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంటే, సోమశిల నుంచి కండలేరుకు నీటిని ప్రవహింపజేసి, అక్కడి నుంచి తెలుగు గంగ ద్వారా చిత్తూరు జిల్లాకు తాగు, సాగునీరు, అలాగే చెన్నైకు తాగునీరు అందించేవారు. ఇప్పుడు సోమశిల అడుగంటిపోతుంటే చెన్నైకు తాగునీరు ఎక్కడ? కండలేరుకు కన్నీటి చుక్క ఎక్కడ? చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు ఏమి ఇవ్వగలరు? అని మేధావులు చర్చిస్తున్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం జిల్లాలో కరువు మండలాలను ప్రకటించలేదు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలన్నీ బెట్టగా మారాయి. జిల్లా పరిధిలోని ఉదయగిరి, సీతారామపురం, మర్రిపాడు, ఆత్మకూరు, జలదంకి, చేజర్ల, ఏఎస్‌పేట, కావలి తదితర మండలాల్లో ఇప్పటికే తాగునీటి అవస్థలు చోటుచేసుకున్నాయి. పై మండలాల్లో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వ అధికారులు మాత్రం ఇంతవరకు కరువుపై సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఇదంతా ఎల్‌నినో ప్రభావమా అని జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. సాధారణంగా బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు, అల్పపీడనాల వల్ల నెల్లూరు, కడప జిల్లాల్లో అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, భారీ వర్షాలు వస్తాయి. కానీ ఈ ఏడాది నవంబర్ మాసం సగం గడిచిపోయినా, విశాఖ కార్తె వచ్చినా తుపాను లేదు. వర్షం జాడ లేదు.

దీనిపై జిల్లా రైతులు ఆందోళనలో మునిగిపోయారు. ఈ ఏడాది వ్యవసాయం చేయగలమా, పంటలు పండించగలమా, కుటుంబాలను పోషించుకోగలమా అన్న భయాందోళనలను పలువురు రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతుండడంతో బోర్లలో కూడా నీరు సక్రమంగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బోర్ల కింద సాగు కూడా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *