వార్త ముఖ్యాంశాలు
- జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో సంభవించే వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ కార్యకలాపాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి లభ్యత, సాగునీటి వనరులు, పశుసంపద, ప్రజారోగ్యం, గ్రామీణ జీవనోపాధిపై పడే సంభావ్య ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని అన్ని మండలాల్లో ప్రస్తుత పరిస్థితులు, సంసిద్ధతా చర్యలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా…
- అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, విద్యుత్ సరఫరా, తాగునీరు, సాగునీటి వనరులు, భూగర్భ జలాలు, పశుసంవర్ధక, ప్రజారోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.
- సాధారణ వర్షపాతంతో పోల్చి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం, వాతావరణ శాఖ అంచనాలను విశ్లేషించాలన్నారు.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో సంభవించే వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ కార్యకలాపాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి లభ్యత, సాగునీటి వనరులు, పశుసంపద, ప్రజారోగ్యం, గ్రామీణ జీవనోపాధిపై పడే సంభావ్య ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని అన్ని మండలాల్లో ప్రస్తుత పరిస్థితులు, సంసిద్ధతా చర్యలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, విద్యుత్ సరఫరా, తాగునీరు, సాగునీటి వనరులు, భూగర్భ జలాలు, పశుసంవర్ధక, ప్రజారోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.
సాధారణ వర్షపాతంతో పోల్చి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం, వాతావరణ శాఖ అంచనాలను విశ్లేషించాలన్నారు. వ్యవసాయ రంగంలో రబీ పంటల సాగుకు అవసరమైన విత్తనాల లభ్యత, ప్రస్తుత పంటల పరిస్థితి, భూమిలో తేమశాతం, పంటలకు ఎదురయ్యే నీటి ఒత్తిడిని అంచనా వేయాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ ఉత్పాదకాల లభ్యతను పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు, అనువైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు సూచనలు చేయాలన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ అంతరాయాల వ్యవధిని సమీక్షించాలని తెలిపారు.
తాగునీటి కొరత ఎదుర్కొంటున్న, భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి తాగునీటి వనరుల పనితీరు, సరఫరా ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. రిజర్వాయర్లు, చెరువులు, భూగర్భ జలాల నిల్వలు, సాగునీటి లభ్యతను సమీక్షించి నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. పశువులకు పశుగ్రాసం, దాణా, తాగునీటి లభ్యతతో పాటు పశువైద్య సేవల సంసిద్ధతను పరిశీలించాలన్నారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ చేపడుతున్న ముందస్తు చర్యలను సమీక్షించాలని సూచించారు.
కరువు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలు, నీటి కొరత ఉన్న ఆవాసాలు, ప్రత్యేక సహాయం అవసరమైన బలహీన వ్యవసాయ కుటుంబాలను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రత్యేక అధికారులు ప్రభావిత గ్రామాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి ధ్రువీకరించడంతో పాటు ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను వేర్వేరుగా అంచనా వేయాలని ఆదేశించారు.
తక్షణ జోక్యం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, శాఖల మధ్య సమన్వయంతో నివారణ, ఉపశమన చర్యలకు సిఫార్సులు చేయాలని సూచించారు.
*మండలాల ప్రత్యేక అధికారులు*
భూపాలపల్లి (గ్రామీణ): ఆర్. తరుణి ప్రసాద్, ఎంపీడీవో.
చిట్యాల: సీహెచ్. సతీష్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్.
కాటారం: టీ. నేతాజీ, ఎన్‌టీ (యూ/టీ).
ఘన్‌పూర్: ఎన్. వంశీ, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్.
కొత్తపల్లి గోరి: కే. సుకృతి, డీఎస్సీడీఓ.
మహాదేవపూర్: జి. నవీన్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (యూ/టీ).
మహాముత్తారం: బి. నిశాంత్, ఎంపీడీవో.
మల్హర్: కే. క్రాంతి కుమార్, ఎంపీడీవో.
మొగుళ్లపల్లి: కే. వేణు, అసిస్టెంట్ రిజిస్ట్రార్.
సింహం: ఎం. దేవేందర్ రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్.
పలిమెల: వీ. పవన్, ఎంపీడీవో.
టేకుమట్ల: ఎస్. పూర్ణచందర్, ఎన్‌టీ (యూ/టీ).
భూపాలపల్లి మున్సిపాలిటీ: కే. ఉదయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్.
ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోజువారీ క్షేత్రస్థాయి తనిఖీ నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారీగా సమగ్ర అంచనా నివేదికతో పాటు గుర్తించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన వనరులు, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, నిర్దిష్ట సిఫార్సులు, కార్యాచరణ ప్రణాళికను అందించాలని స్పష్టం చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.