వార్త ముఖ్యాంశాలు
- చేజర్లలో ఆర్ఓల మార్పుపై అనుమానాలు నివృత్తి చేయాలిఅధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలితప్పులు పునరావృతమైతే సహించేది లేదు: మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని…
- గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా ఎన్నికల యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.
- చేజర్ల మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 13 పంచాయతీలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులను మార్చడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
చేజర్లలో ఆర్ఓల మార్పుపై అనుమానాలు నివృత్తి చేయాలి
అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
తప్పులు పునరావృతమైతే సహించేది లేదు: మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి కోరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా ఎన్నికల యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.
చేజర్ల మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 13 పంచాయతీలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులను మార్చడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను రిటర్నింగ్ అధికారులుగా నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని, అయితే ఈ నెల 10వ తేదీన 13 పంచాయతీలకు సంబంధించి ఆర్ఓలను మార్చుతూ మరోసారి ఉత్తర్వులు వెలువడటం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారు.వారం రోజుల క్రితం నియమించిన ప్రధానోపాధ్యాయులను తొలగించి వారి స్థానంలో రెవెన్యూ, రీ సర్వే తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులను నియమించే అవకాశం ఉన్నప్పటికీ, వివిధ శాఖల అధికారులను ఎంపిక చేయడం వెనుక ఆంతర్యమేమిటో జిల్లా ఎన్నికల యంత్రాంగం స్పష్టం చేయాలని కోరారు.
గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు కొందరు అధికారులు వత్తాసు పలికారని మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నామినేషన్ల పరిశీలన పేరుతో అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించే పరిస్థితులు మళ్లీ తలెత్తకూడదని అన్నారు.ఎన్నికల నిర్వహణలో స్టేజ్-1 స్థాయి అధికారి ఎంఈఓ స్థాయిలో ఉండాలని, అందుకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారుల నియామకాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కింది స్థాయి ఉద్యోగులను నియమించి, స్క్రూటినీ పేరుతో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించే ప్రయత్నాలు చేస్తే ఈసారి సహించేది లేదని హెచ్చరించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామస్థాయి ప్రజాస్వామ్యానికి పునాదులని, వాటిని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారుల నియామకం నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ వరకు ప్రతి దశలో ఎన్నికల సంఘం నిరంతర పర్యవేక్షణ ఉండాలని కోరారు.చేజర్ల మండలంలోని 13 పంచాయతీల్లోనే ఆర్ఓలను ఎందుకు మార్చాల్సి వచ్చిందో జిల్లా ఎన్నికల అధికారులు ప్రజలకు వివరించాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని మేకపాటి విక్రమ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం పెంపొందించేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.