Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇసుక రీచ్‌పై భగ్గుమన్న పెన్నబద్వేల్‌ గ్రామస్థులు… తాగు, సాగునీటి వనరులకు ముప్పు తెస్తే ఊరుకోం… 500 ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆందోళన…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

అనంతసాగరం సెప్టెంబర్ 27,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇసుక రీచ్‌పై పెన్నబద్వేల్‌ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు అడుగంటిపోయి గ్రామంలోని తాగునీటి వనరులతో పాటు సాగునీటి వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 500 ఎకరాల పంట భూములకు సాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు పేర్కొన్నారు.ఇప్పటికే గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని గ్రామస్థులు తెలిపారు. ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాల మట్టం తగ్గితే తాగునీటితో పాటు పంట పొలాలకు అందే సాగునీటిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. రైతుల జీవనాధారమైన వ్యవసాయంపై దాని ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇసుక రీచ్‌ ఏర్పాటు విషయం తెలుసుకున్న పెన్నబద్వేల్‌ గ్రామానికి చెందిన సుమారు 150 మంది గ్రామస్థులు రీచ్‌ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. తమ గ్రామానికి తాగునీరు, సాగునీటి వనరులకు నష్టం కలిగించే విధంగా ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని డిమాండ్‌ చేశారు. ఇసుక రీచ్‌ ఏర్పాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అధికారులను కోరారు.సమాచారం అందుకున్న సోమశిల ఎస్సై అనూష సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా పరిష్కారం పొందాలని సూచించారు. అయితే తమ గ్రామ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్థులు స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా పీకేపాడు ప్రాంతంలోని ఇసుక రీచ్‌లోనూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రోజుకు సుమారు 200 ట్రిప్పుల ఇసుకను ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి అనుమతులు లేని ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.తాగునీరు, సాగునీటి వనరులకు నష్టం కలిగించే ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని, రీచ్‌లకు సంబంధించిన అనుమతులు, పర్యావరణ నిబంధనలు, తవ్వకాల పరిమితులను అధికారులు పరిశీలించాలని గ్రామస్థులు కోరారు.నిరసనలో రైతులు చింతంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, లంక శేఖర్‌, చింతంరెడ్డి వెంకటరెడ్డి, బెల్లం రమణారెడ్డి, కొత్తూరు జయరామిరెడ్డి, నల్లకొండ మురళిరెడ్డితో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌పై భగ్గుమన్న పెన్నబద్వేల్‌ గ్రామస్థులు… తాగు, సాగునీటి వనరులకు ముప్పు తెస్తే ఊరుకోం… 500 ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆందోళన…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *