వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, నవంబర్ 24 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆలయాల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తూ భక్తుల విశ్వాసాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు.
- రేణిగుంట మండలం అంజనేయపురంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
- మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.దేవాదాయశాఖ అధికారుల నివేదిక ప్రకారం అంజనేయపురం ఆలయాన్ని గ్రామస్తులు సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించారని, అలాంటి ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందంటూ ప్రచారం చేయడం వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు.
అంజనేయస్వామి ఆలయంపై భూమన కరుణాకర్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారు
రూ.59.30 లక్షలు ఆలయం పేరుతోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు, నవంబర్ 24 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆలయాల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తూ భక్తుల విశ్వాసాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. రేణిగుంట మండలం అంజనేయపురంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మంగళవారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.దేవాదాయశాఖ అధికారుల నివేదిక ప్రకారం అంజనేయపురం ఆలయాన్ని గ్రామస్తులు సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించారని, అలాంటి ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందంటూ ప్రచారం చేయడం వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆలయానికి సంబంధించిన భూమిని సేకరించారని, పరిహారంగా మంజూరైన రూ.59,30,606లను ఆలయ ఈవో ఖాతాలో జమ చేసి, అనంతరం ఆలయం పేరుతోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని వివరించారు. నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
ఆలయ తొలగింపునకు ముందు అర్చకులు, దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం బాలాలయం ఏర్పాటు చేసి, మూలవిరాట్‌ను శాస్త్రోక్తంగా తరలించామని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం పక్కనే 50 సెంట్ల స్థలాన్ని కేటాయించినట్లు వెల్లడించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వెండి సింహాల మాయం, రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం వంటి ఘటనలపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమం, ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆలయాల పవిత్రతను, భక్తుల విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని భూమన కరుణాకర్‌రెడ్డికి సూచించారు.