Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తెలుగు తేజం : డాక్టర్ మేక వెంకట రాఘవేంద్ర వర్మ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తెలుగు తేజం : డాక్టర్ మేక వెంకట రాఘవేంద్ర వర్మ

: విదేశీయులు గుర్తించిన తెలుగు వాసి..
: బెర్లిన్ హంబోల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం..
: స్వదేశానికి తిరిగి వస్తున్న డా. మేక వెంకట రాఘవేంద్ర వర్మ..
: సంస్కృత శాసన పరిశోధనలో విశిష్ట సేవలు..
: తెలుగు ప్రజలకు గర్వకారణం..
: కపిలేశ్వరపురం నుండి జర్మనీ..
పున్నమి ప్రతినిధి : షేక్ . రసూల్ అహమ్మద్..
భారతీయ ప్రాచీన చరిత్ర, సంస్కృత భాష, శాసన పరిశోధన రంగాల్లో విశేష కృషి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. మేక వెంకట రాఘవేంద్ర వర్మ , జర్మనీలోని బెర్లిన్ హంబోల్ట్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పరిశోధనా కార్యక్రమంలో పాల్గొని రేపు భారతదేశానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పున్నమి ప్రత్యేక కథనం . …
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కపిలేశ్వరపురం వాసి అయిన డా. వర్మ, తన విద్యా ప్రతిభతో పాటు నిరంతర పరిశోధన, అంకితభావంతో శాసనశాస్త్ర రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ASI) పరిధిలోని శాసనాల సంచాలక కార్యాలయం, మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఎపిగ్రాఫిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా భారతీయ చారిత్రక శాసనాల పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ రంగాల్లో సేవలందిస్తున్నారు.
ప్రాచీన భారత చరిత్ర వెలుగులోకి తెస్తున్న పరిశోధకుడు :
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో పీజీ పూర్తి చేసిన డా. వర్మ, పుదుచ్చేరి విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్., పీహెచ్‌డీ పట్టాలు పొందారు. సంస్కృత భాష, సాహిత్యం, ప్రాచీన లిపులు, శాసనాల అధ్యయనంపై ప్రత్యేక ఆసక్తితో పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
అశోక బ్రాహ్మీ లిపిని నేర్చుకోవాలనుకునే విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగపడేలా ‘Asokan Brahmi: A Learner’s Practice Book’ అనే గ్రంథాన్ని రచించారు. అలాగే ‘నీతి ద్విషష్టిక’ అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి, ఆంగ్లంలోకి అనువదించారు.
తొలి చారిత్రక యుగానికి చెందిన బ్రాహ్మీ శాసనాలతో పాటు తూర్పు చాళుక్యులు, రెడ్డి రాజులు, విజయనగర రాజవంశాలకు సంబంధించిన రాగిరేకు శాసనాలపై పరిశోధనలు నిర్వహించారు. గుజరాత్‌లోని వల్లభీపూర్ ప్రాంతంలో లభించిన క్రీ.శ. 5వ నుంచి 8వ శతాబ్దాల మధ్యకాలానికి చెందిన మైత్రక రాజవంశపు శిలాముద్రికలను కూడా పరిశోధించి, శాస్త్రీయంగా సంపాదకత్వం వహించి ప్రచురించారు. ఆయన పరిశోధనలు భారతదేశపు ప్రాచీన చరిత్ర, రాజవంశాలు, పరిపాలన, మతం, సంస్కృతికి సంబంధించిన విలువైన సమాచారాన్ని వెలికితీయడంలో దోహదపడుతున్నాయి.
అంతర్జాతీయ పరిశోధనా ప్రాజెక్టులో కీలక భాగస్వామ్యం :
డా. వర్మ పరిశోధనా ప్రతిభకు గుర్తింపుగా జర్మనీలోని బెర్లిన్ హంబోల్ట్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ పరిశోధనా కార్యక్రమమైన DHARMA ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించేందుకు ఆహ్వానం అందింది. యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ (ERC) సైనర్జీ గ్రాంట్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు దక్షిణ, ఆగ్నేయ ఆసియాల ప్రాచీన, మధ్యయుగ పూర్వ చరిత్రను అధ్యయనం చేస్తోంది.
‘The Domestication of “Hindu” Asceticism and the Religious Making of South and Southeast Asia’ అనే పూర్తి పేరుతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ముఖ్యంగా క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు మతం, రాజ్యం, సమాజం మధ్య ఉన్న సంబంధాలను పరిశీలిస్తుంది.
ఈ పరిశోధనా కార్యక్రమంలో డా. వర్మ భాగస్వామ్యం సంస్కృత శాసనాలపై ఆయనకున్న పట్టు, భారతీయ చారిత్రక ఆధారాలపై ఆయన చేసిన పరిశోధనలకు లభించిన గుర్తింపుగా భావించవచ్చు. భారతీయ శాసన సంపద అంతర్జాతీయ చరిత్ర పరిశోధనలకు ఎంతటి విలువైనదో ఈ అవకాశం మరోసారి చాటిచెబుతోంది. సంస్కృతంలో ఈయన ప్రతిభకు విదేశీయులు సైతం అచ్చెరువు చెందడం విశేషం.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చురుకైన పాత్ర :
డా. వర్మ అనేక పరిశోధనా వ్యాసాలను ప్రతిష్ఠాత్మక విద్యా పత్రికల్లో ప్రచురించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించారు. 2023లో బ్యాంకాక్‌లో, 2025లో జర్మనీలో నిర్వహించిన సంస్కృత సాహిత్యానికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఏపీ గ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో జాతీయ కార్యనిర్వాహక అధికారిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రాచీన శాసనాలను చదవడం, లిపులను పరిష్కరించడం, వాటిలోని సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ప్రచురించడం అత్యంత నైపుణ్యం అవసరమైన పరిశోధనా ప్రక్రియలు. ఈ రంగంలో ఆయన అందిస్తున్న సేవలు భవిష్యత్ తరాల పరిశోధకులకు ఉపయోగపడటమే కాకుండా భారతీయ చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతున్నాయి.
కపిలేశ్వరపురం నుంచి అంతర్జాతీయ ఖ్యాతి వరకు :
స్వగ్రామం కపిలేశ్వరపురం నుంచి తన విద్యా ప్రస్థానాన్ని ప్రారంభించి, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించి, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థలో శాసన పరిశోధకుడిగా సేవలందిస్తూ అంతర్జాతీయ పరిశోధనా వేదికపై గుర్తింపు పొందడం డా. వర్మ ప్రస్థానంలో విశేషమైన మైలురాయి. ఒక ప్రాంతానికి చెందిన పరిశోధకుడి విజయం ప్రపంచస్థాయి శాస్త్రీయ వేదికపై భారతీయ విజ్ఞాన సంపదకు గుర్తింపుగా నిలిచి సరిహద్దులు లేని భారతీయతకు అద్దం పడుతోంది ఆయన సాధించిన ఈ ఘనత ఒక్క కపిలేశ్వరపురానికే కాకుండా యావత్ భారతేదేశానికే గర్వ కారణంగా చెప్పవచ్చు . అన్ని వున్న విస్తరాకు అణిగిమణిగి ఉన్నట్టుగా నిండైన విద్యాపారంగతుడుగా డాక్టర్ మేక వెంకట రాఘవేంద్ర వర్మ, భవిష్యత్తులో సంస్కృత భాషాభివృద్ధికి మరింతగా కృషి చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తెలుగు తేజం : డాక్టర్ మేక వెంకట రాఘవేంద్ర వర్మ

అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తెలుగు తేజం : డాక్టర్ మేక వెంకట రాఘవేంద్ర వర్మ

అంతర్జాతీయ పరిశోధనా రంగంలో తెలుగు తేజం : డాక్టర్ మేక వెంకట రాఘవేంద్ర వర్మ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *