అంగన్‌వాడీ కేంద్రాలే చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాదులు: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
కొత్తవలస ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఘనంగా ‘సేవా సంకల్ప అభియాన్ – అంగన్‌వాడీ ఉత్సవం’
చిన్నారుల క్యాలెండర్ ఆవిష్కరణ.. అంగన్‌వాడీ కార్యకర్తలకు చీరల పంపిణీ, సన్మానాలు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్07. పున్నమి ప్రతినిధి
అంగన్‌వాడీ కేంద్రాలు దేవాలయాల వంటివని, అక్కడ చిన్నారులను తీర్చిదిద్దుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అమ్మలాంటి బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తున్నారని శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కొనియాడారు. కొత్తవలస మండల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ‘సేవా సంకల్ప అభియాన్ – అంగన్‌వాడీ ఉత్సవం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చిన్నారుల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్లకు చీరలు పంపిణీ చేసి, ఉత్తమ సేవలు అందించిన టీచర్లను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ.. “ఒక కన్నతల్లి మాతృత్వంతో చిన్నారులను పెంచినట్లుగా, అంగన్‌వాడీ సెంటర్లలో టీచర్లు, ఆయాలు వారిని తమ సొంత బిడ్డల్లా సాకుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలుగా, ఆయాలుగా సేవలు అందించే అవకాశం దక్కడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి” అని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, బాలామృతం, పాలు, గుడ్లు, చిక్కీలు వంటి పోషకాహారాలను పక్కాగా అందిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనతో సమానంగా పరిగెత్తడం తమకే కష్టంగా మారుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులను సమీకరిస్తున్నారని చెప్పారు. పెంచిన పింఛన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా మార్చడం వంటి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ ద్వారా శృంగవరపుకోట నియోజకవర్గానికి రూ.96 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేసి మహిళల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయాలకు తావులేకుండా నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఐసీడీఎస్ పీడీ కేవీ. బాలమణి, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, అయ్యారక కన్వీనర్ బంగారు రమేష్, కొత్తవలస గ్రామ పార్టీ అధ్యక్షుడు కోరుపోలు అప్పారావు, ఏఎంసి డైరెక్టర్ గేదెల శ్రీనమ్మ, గొరపల్లి రవి కుమార్, స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

