Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ప్రజా నమ్మకమే మా బలం.. ప్రజాసేవే మీ బాధ్యత!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజా నమ్మకమే మా బలం.. ప్రజాసేవే మీ బాధ్యత!

వార్త ముఖ్యాంశాలు

  • కూటమికి ఎదురొడ్డి 11 మంది కౌన్సిలర్ల విజయం..
  • ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో గళమెత్తాలి..
  • మీకు అండగా మేమున్నాం!

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు

కూటమికి ఎదురొడ్డి 11 మంది కౌన్సిలర్ల విజయం.. ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో గళమెత్తాలి.. మీకు అండగా మేమున్నాం!

ఆత్మకూరు, నవంబర్ 21 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లు నిరంతరం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ, సీపీఎం కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

శనివారం ఆత్మకూరులోని తన కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులతో మేకపాటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ తరఫున 10 మంది, సీపీఎం తరఫున ఒకరు విజయం సాధించి మొత్తం 11 మంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారని తెలిపారు. అధికార పార్టీ నుంచి ఎదురైన ఒత్తిళ్లు, ప్రలోభాలను అధిగమించి ప్రజల మద్దతుతో విజయం సాధించిన అభ్యర్థుల కృషిని అభినందించారు. ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

వార్డు సమస్యలపై ప్రత్యేక దృష్టి

కౌన్సిలర్లు తమ వార్డుల్లో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, రహదారుల వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మేకపాటి సూచించారు. మున్సిపాలిటీకి రావాల్సిన అభివృద్ధి నిధులు, మంజూరైన నిధుల వినియోగం, చేపట్టాల్సిన పనులపై కౌన్సిల్ సమావేశాల్లో అధికారులను నిలదీయాలని కోరారు. ప్రజల సమస్యలను కౌన్సిల్‌లో ప్రస్తావించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని తెలిపారు.

కష్టకాలంలో అండగా నిలిచిన వారికి గుర్తింపు

ఎన్నికల సమయంలో పార్టీ కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థుల సేవలను ఎప్పటికీ మరువబోమని మేకపాటి స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలోనూ వెన్నంటి నిలిచిన వారి సేవలను గుర్తించి గౌరవిస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడించే అవకాశం కల్పించామని వివరించారు.ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు ఓటమి పాలైన అభ్యర్థులు కూడా నిరుత్సాహపడకుండా ప్రజల్లోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు

.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చుల్లూరు ఆదిశేషయ్య, పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాపరెడ్డి, సీపీఎం పట్టణ కార్యదర్శి కొప్పోలు డేవిడ్‌రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సంధాని, లీగల్ సెల్ నాయకుడు అడ్వకేట్ నంద ఓబులేసు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *