పంచాయితీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఈరోజు కోలమూరు పంచాయతీ నందు గ్రామంలో ఉన్న అనేక సమస్యలు అభివృద్ధి పనులపై కమిషనర్ రాహుల్ మీనా తో కలిసి ఎమ్మెల్యే గోరంట్ల సమీక్ష నిర్వహించారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల గ్రామంలో పారిశుద్ధ్యం అసలు బాగాలేదని ఎక్కడి చెత్త అక్కడే పెరుగుతుందని సకాలంలో మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రూరల్ మండలంలో ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న కోలమూరు పంచాయతీ నందు అనేక సమస్యలు ఉన్నాయని, వీటన్నిటిని పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషనర్ అధికారులు మరియు గ్రామ పెద్దలతో కలిసి ప్రజల అభీష్టం మేరకు చేయవలసిన పనులపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. త్వరలోనే గ్రామంలో 8 కోట్ల పనులు చేపట్టాలని 4 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు, 4 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. గ్రామంలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 36 కోట్ల రూపాయలతో అంచనాల సిద్ధం చేశామని, ఈ సంవత్సరంలో 8 కోట్ల రూపాయలు పనులు చేస్తామని, రాబోయే రెండు సంవత్సరాల కాలంలో మొత్తం పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రజలకు పంచాయతీ అధికారులు అందుబాటులో ఉండాలని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలని, సచివాలయ సిబ్బంది ఇకనుండి అయిన పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ అధికారులు సిబ్బంది పనితీరు మార్చుకోవాలని పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య పనులను విభాగాలుగా విభజించి పనులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులపై పూర్తిస్థాయి సమీక్ష జరిపి తక్షణమే నిధులు విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మత్శేటి ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు పెన్నమరెడ్డి ఈశ్వరుడు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారాయణ గౌడ్, సొసైటీ అధ్యక్షులు అడ్డాల శ్రీను, డైరెక్టర్ కర్రీ అప్పలస్వామి, దండమూడి ప్రసాద్, తాడేపల్లి నాగరాజు, దండమూడి తేజ, ఉండవల్లి బంగారు రాజు, నాగుల శివ, బత్తిన రత్నరాజు, ఎంపీడీవో సునీల్ ఆర్మ స్ట్రాంగ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో అమ్మిరాజు, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


