పాడేరు, నవంబర్ 2: ఆర్నబ్ తుఫాన్ అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజల ప్రాణరక్షణ, అత్యవసర సేవల పునరుద్ధరణ, రైతుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ నిశాంతి టి. తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమర్పించిన నివేదికల ప్రకారం జిల్లాలో విద్యుత్, రహదారులు, తాగునీరు, సాగునీటి పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
విద్యుత్ సరఫరా: విద్యుత్ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 1,48,856 గృహ విద్యుత్ సర్వీసులకు సరఫరా పునరుద్ధరించారు. అదేవిధంగా 8,075 వాణిజ్య, 110 పారిశ్రామిక, 7,034 ప్రభుత్వ, 403 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సరఫరా అందించారు. నేలకొరిగిన 12 సంఖ్యలో 33 కేవీ స్తంభాలను పూర్తిగా సరిచేశారు. 11 కేవీ స్తంభాల్లో 191, ఎల్టీ స్తంభాల్లో 178 పునరుద్ధరించారు.
రహదారులు, ప్రజల భద్రత: ఆర్అండ్బీ శాఖ నివేదిక ప్రకారం 10 తుఫాన్ ప్రభావిత రహదారుల్లో 53.4 కిలోమీటర్ల మేర రాకపోకలు పునరుద్ధరించారు. రహదారులపై చెట్లు తొలగించి మరో 183.6 కిలోమీటర్ల మేర క్లియరెన్స్ పనులు చేపట్టారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేసి, 56 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 117 క్షేత్రస్థాయి సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టి 577 మందికి ప్రయోజనం కల్పించారు.
సాగునీరు, భూగర్భ జలాలు: సాగునీటి శాఖ నివేదిక ప్రకారం 11 చిన్నతరహా చెరువుల్లో 0.1210 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాలుగు చెరువులు పూర్తిగా నిండాయి. 41.40 కిలోమీటర్ల ఫీడర్ కాలువల్లో అడ్డంకులు తొలగించారు. 200 వ్యవసాయ పొలాలను వరద ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టారు. భూగర్భ జల శాఖ నివేదిక ప్రకారం తుఫాన్ అనంతరం భూగర్భ జలమట్టం 1.66 మీటర్లు పెరిగింది.
రైతులకు ఆర్థిక భరోసా: వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 7,329 మంది రైతులు 3,381.4 హెక్టార్లకు పంటల బీమా నమోదు చేసుకున్నారు. పంట నష్టాల అంచనాలు పూర్తిచేసి అర్హులకు బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 1,03,864 మంది రైతులు అర్హత పొందగా, రబీ విడతగా రూ.7,000 ఆర్థిక సహాయం విడుదలైంది.
అన్ని శాఖల అధికారులు ప్రతిరోజూ తాజా నివేదికలు, క్షేత్రస్థాయి ఫొటోలతో పునరుద్ధరణ పనుల పురోగతిని తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల భద్రత, సాధారణ జీవన పరిస్థితుల పునరుద్ధరణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.



వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన