ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఉపాధ్యాయుడి స్థానానికి ప్రత్యామ్నాయం లేదు: ఎమ్మెల్యే నల్లమిల్లి
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 5 (పున్నమి ప్రతినిధి): భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆనం కళావేదికలో నిర్వహించిన “గురుపూజోత్సవం–2026” కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ తదితరులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 99 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని, భవిష్యత్తును తీర్చిదిద్దే గురువుల సేవలకు సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. “గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వరః” అనే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ గురువుకు అత్యున్నత స్థానం కల్పించామని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో విద్యార్థులకు సమాచారం తక్షణమే అందుతున్నప్పటికీ, విద్యార్థి మానసిక స్థితిని అర్థం చేసుకుని, అతని సమస్యలను గుర్తించి సరైన మార్గనిర్దేశం చేయడం ఉపాధ్యాయుడికే సాధ్యమని అన్నారు. అందువల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యామ్నాయం లేదన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, వారిని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.
స్వప్రయోజనాన్ని కొంత పక్కనపెట్టి సమాజ సేవ చేయాలన్న గురజాడ అప్పారావు సందేశాన్ని గుర్తుచేశారు. అస్సాంకు చెందిన ఉపాధ్యాయుడు 2 వేల మందికి పైగా విద్యార్థులకు విద్య అందించి, గ్రామీణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉదాహరణను ప్రస్తావిస్తూ అలాంటి సేవా స్ఫూర్తిని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉపాధ్యాయ వృత్తికి ఇచ్చిన ప్రాధాన్యతను ఎమ్మెల్యే గుర్తుచేశారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రజాజీవితాన్ని ఉపాధ్యాయురాలిగా ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. గురువులను ప్రతి పౌరుడు గౌరవించాలని, ప్రభుత్వం వారికి అండగా నిలవాలని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తోందని నల్లమిల్లి తెలిపారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, పారదర్శక బదిలీల కోసం చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
అనపర్తి నియోజకవర్గం నుంచి 11 మంది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక కావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కుతుకులూరు గ్రామానికి చెందిన ఎన్.వి. రాఘవరావు ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా సింగపూర్ వెళ్లి రావడాన్ని అభినందించారు. రంగంపేట జడ్పీ హైస్కూల్‌కు చెందిన శ్రీమతి రమ్యశ్రీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
















