భూభారతిలో అక్రమాలకు పచ్చజెండా.. సక్రమ పట్టాలకు మాత్రం నో ఎంట్రీ!
మంథని, అక్టోబర్ 12: భూ భారతి పోర్టల్లో భూముల నమోదు వ్యవహారంపై అక్రమాలు జరిగాయంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు మంథని రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని, మరోవైపు సక్రమమైన భూముల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. భూముల రికార్డులు, మార్కెట్ విలువల నిర్ధారణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మంథని గ్రామంలోని సర్వే నంబర్ 94/బి (హెచ్.నంబర్ 2-5/ఏ)కు సంబంధించిన భూముల వ్యవహారంలో 1992 నాటి కట్టడాలు, ఇంటి రికార్డులు, 788/1982 డాక్యుమెంట్ వివరాలను ప్రస్తావిస్తూ ఫిర్యాదుదారు పలు సందేహాలు లేవనెత్తారు. సర్వే నంబర్ 94/డి, లోని భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపించారు. సుమారు 40 సెంట్ల భూమికి సంబంధించిన రికార్డులు, నిషేధిత జాబితా వివరాలను పరిశీలించి వాస్తవాలు వెల్లడించాలని కోరారు.సంబంధిత భూమి మార్కెట్ విలువ సుమారు రూ.82 లక్షలు ఉండగా, ఖాతా నంబర్ 61183, 0.0526 గుంటల విస్తీర్ణానికి రూ.5.60 లక్షలుగా విలువ చూపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.5,62,500 విలువ ఆధారంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినట్లు రాజగోపాల్ ఆరోపించారు. భూమి వాస్తవ మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకున్నారా? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి నష్టం జరిగిందా? అనే అంశాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో నిబంధనలు పాటించారా? సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. కలెక్టర్ లాగిన్ ద్వారా వివరాల్లో మార్పులు జరిగాయన్న ఆరోపణలపై సాంకేతిక రికార్డులను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని కోరారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉందన్నారు. మంథని పరిధిలోని సర్వే నంబర్ 1112/ఏ, బి, సి, డి లోని రెండు ఎకరాల భూమికి సంబంధించి డాక్యుమెంట్ నంబర్ 2209/2011, పట్టా వివరాలు, ఎస్ఎల్ఎన్ఎస్/2020/1 దరఖాస్తు తేదీ 26-08-2020ను ఫిర్యాదులో ప్రస్తావించనన్నారు. సంబంధిత భూమి రికార్డులు, దరఖాస్తు స్థితి, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు. భూభారతి పోర్టల్లో భూముల రికార్డుల నిర్వహణ, నిషేధిత జాబితా మార్పులు, మార్కెట్ విలువల నిర్ధారణపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని రాజగోపాల్ కోరారు. అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.









