విశాఖపట్నం
*ప్రశాంతినిలయం విశాఖ పున్నమి ప్రతినిధి* *భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి మహోత్సవాలు – ఆత్మనివారణ, భక్తి, శాంతి మార్గాలపై ఆత్మీయ ఆవిష్కరణలతో నిండిన ప్రేరణామయ ఉదయం* XI శ్రీ సత్య సాయి ప్రపంచ సదస్సు – 2వ రోజు ఉదయం కార్యక్రమం “వ్యక్తిని లయపరచడం – ప్రపంచ శాంతి కోసం మార్గాలు” శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి మహోత్సవాల సందర్భంగా ప్రశాంతినిలయంలో జరుగుతున్న XI శ్రీ సత్య సాయి ప్రపంచ సదస్సు రెండో రోజు ఉదయం కార్యక్రమం ఆధ్యాత్మిక స్పూర్తితో ప్రారంభమైంది. “వ్యక్తిని లయపరచడం” (dissolving the individual )అనే అంశంతో ప్రారంభమైన ఈ సమావేశం, పరిమిత వ్యక్తిత్వాన్ని దాటి అనంత దైవిక సాన్నిధ్యాన్ని అనుభవించే పథంలో లోతైన ఆత్మచింతనను కలిగించింది. ఉదయం కార్యక్రమం వైదిక మంత్రాల గంభీరఘోషతో ప్రారంభమై సాయి కులవంత్ మందిరం పవిత్రతతో నిండిపోయింది. శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ (SSSGC), శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల ప్రపంచ సదస్సులో 45 దేశాల నుండి 2500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. *భక్తి యొక్క గాఢత – మిస్ సరీతా అయ్యర్ ప్రసంగం* మిస్ సరీతా అయ్యర్ తన ఆధ్యాత్మిక సందేశంలో “భక్తి” యొక్క మర్మాన్ని అందంగా వివరించారు. దైవ మహిమను, దైవ కరుణను నిజంగా గుర్తించిన క్షణమే భక్తి పుడుతుందని ఆమె పేర్కొన్నారు. గజేంద్ర మోక్షం ప్రసంగంలోని అంతర్లీనార్థాన్ని వివరిస్తూ— పూర్ణ సమర్పణ, నిర్మలమైన శరణాగతి ఉన్నచోట భగవంతుడు ఎలా వెంటనే ప్రత్యక్షమై రక్షిస్తాడో అద్భుతంగా వివరించారు. ఆమె సందేశం మొత్తం సభలో ఆత్మనివేదన, భక్తి భావాలను మరింత పెంచింది. *ఆకట్టుకున్న శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ యంగ్ అడల్ట్స్ సంగీత సమర్పణ* తరువాత శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ యువత విభాగం సమర్పించిన హృదయం కదిలించే సంగీతార్పణ భక్తి వాతావరణాన్ని మరింత గాఢం చేసింది. *శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ డా. వీ. మోహన్ ప్రసంగం* శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ వీ. మోహన్ సందేశం అనంతరం, సదస్సు ప్రధాన అంశాలపై లోతైన ఆలోచనలకు ప్రేరేపించే ఆడియో-విజువల్ ప్రదర్శనను చూపించారు. పుట్టపర్తి మాత్రమే భగవాన్ వారి యొక్క జన్మభూమి అని, వారు ఇక్కడి నుంచే అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల పుట్టపర్తి కర్మభూమి గా కుడా ఎప్పటికీ విలసిల్లుతుంది అని డాక్టర్ వి మోహన్ చెప్పారు. భగవాన్ వారు సూచించిన సేవా మార్గం లో ప్రతిఒక్కరూ ఈ సందర్భంగా పునరంకితం కావాలని, అదే ప్రతి ఒక్కరూ స్వామి వారికి ఇవ్వగలిగిన పుట్టినరోజు గిఫ్ట్ గా అభివర్ణించారు. *ఈ రోజు కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు: శ్రీ అశోక్ చవాన్, రాజ్యసభ సభ్యుడు & మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డా. భగవత్ కరాడ్, రాజ్యసభ సభ్యుడు, శ్రీమతి సిందూరా రెడ్డి, ఎమ్మెల్యే – పుట్టపర్తి, డా. జి. గీతా రెడ్డి, తెలంగాణ మాజీ శాసన సభ్యురాలు* *ముందుగా శ్రీ ఆర్.జె. రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ – శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్, విశిష్ట అతిధులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలిపారు*. శ్రీ నిమిష్ పాండ్యా, (ఆల్ ఇండియా ప్రెసిడెంట్ – SSSSO & వైస్ చైర్మన్ – SSSGC) తన స్వాగత సందేశం లో ప్రశాంతినిలయం కు రావడం వల్ల, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ద్వారా సేవలో పాల్గొనడం వల్ల ప్రతిఒక్కరూ మార్పు చెంది తమ జీవితాల్ని ఉన్నతంగా తీర్చి దిద్దుకోవడానికి దోహద పడుతుందని తెలియ చేశారు. *శ్రీ అశోక్ చవాన్ తన హృదయపూర్వక అనుభవాలను పంచుకున్నారు*. తానూ పలు ఏళ్లుగా తన పదవికి సంబంధం లేకుండా, కేవలం భక్తుడిగా మాత్రమే పుట్టపర్తిని సందర్శిస్తూ వచ్చానని తెలిపారు. ఒకసారి అకస్మాత్తుగా వచ్చిన సందర్శన తనలో మరింత వినమ్రతను, భక్తిని పెంచిందని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. తాను 55 సంవత్సరాలుగా పుట్టపర్తి వస్తున్నానని, భగవాన్ బాబా వారి ఆశీస్సులు తనకు ఎంతగానో దోహదపడ్డాయని, కాపాడాయని అయన పేర్కొన్నారు. ఇప్పటికీ బాబా వారు రక్షిస్తూనే ఉన్నారని శ్రీ ఆషా చవాన్ పేర్కొన్నారు. *మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ కీలక ప్రసంగం* ప్రశాంతినిలయంలో తొలిసారి ప్రసంగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారు. తన కుటుంబం అనేక దశాబ్దాలుగా స్వామివారి భక్తులు అని చెప్పి, పుట్టపర్తిలో ప్రతి చోటా స్వామి ప్రేమ, దివ్యసాన్నిధ్యం వెలిసిపోతుందని హృదయపూర్వకంగా పంచుకున్నారు. స్వామివారు ప్రపంచానికి అందించిన శాశ్వత సందేశం—“Love All, Serve All” తనతో పాటు తీసుకెళ్తానని పేర్కొన్నారు. *ఒడిశా గవర్నర్ గౌరవనీయులు డా. కంభంపాటి హరి బాబు గారి ప్రసంగం* డా. హరి బాబు గారు భగవాన్‌ను మానవతా దీప్తి, నిస్వార్థ సేవకు ప్రతిరూపం అని వర్ణించారు. స్వామివారి త్రివిధ సేవా యజ్ఞాలు—శుద్ధజల ప్రాజెక్టులు,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విలువల ఆధారిత విద్యా వ్యవస్థ,ఇవన్నీ ప్రపంచానికి ఆదర్శ నమూనాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకలుగా ప్రకటించడాన్ని డాక్టర్ కె హరిబాబు అభినందించారు. స్వామి బోధించిన ఏకత్వం, ప్రేమ, సేవనే మనం ఆచరించడం ఆయనకు అత్యుత్తమ నైవేద్యమని పేర్కొన్నారు. *“శ్రీ సత్య సాయి జీవన ఉపాధి” కార్యక్రమ ప్రారంభం – 100 ఆటోరిక్షాల పంపిణీ* ఈ రోజు ముఖ్య విశేషంగా, కేరళ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు చేపట్టిన *“శ్రీ సత్య సాయి జీవన ఉపాధి”* కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, కేరళ రాష్ట్రానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం విశిష్ట అతిథుల హస్తాల ద్వారా జరిగి, సేవ, సాక్షాత్కార, శక్తివంతతలకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ఆర్ధికంగా వెనుకబడిన అయిదు గురికి ఆటోరిక్షాల పంపిణీ చేశారు. ఈనాటి కార్యక్రమం లో శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలు కూడా పాల్గొన్నారు. ఈ నాటి ఉదయ కార్యక్రమం భజనలు మంగళారతి తో ముగిసాయి.