ఖానాపురం పున్నమి ప్రతినిధి: జనతా ట్రస్ట్ చైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఖానాపురంలోని రెడ్డి పెద్ద రంగారెడ్డి ఫంక్షన్ హాల్లో జనతా ట్రస్ట్, బంధన్ హాస్పిటల్స్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం, 5వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 476 మందికి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన 66 మందిని హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేశారు.
బంధన్ హాస్పిటల్స్‌కు చెందిన 12 మంది స్పెషలిస్ట్ వైద్యులు 268 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందించి, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే జనతా ట్రస్ట్ లక్ష్యమని, డబ్బులేక ఎవరూ వైద్యానికి దూరం కాకూడదని అన్నారు.
కార్యక్రమంలో జనతా ట్రస్ట్ సభ్యులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
