*ఉప్పు శరీరానికి ‘అత్యావశ్యకం’… కానీ ఎక్కువైతే ‘ప్రమాదకరం’! తక్కువైనా ప్రమాదమే.*
ఉప్పు లేని వంటను ఊహించగలమా? ఎంతటి రాచభోజనమైనా చిటికెడు ఉప్పు లేకపోతే చప్పగా అనిపిస్తుంది. మన శరీరం అనే పెద్ద ఫ్యాక్టరీ సక్రమంగా పనిచేయడానికి కూడా ఉప్పు అవసరమే! కానీ అవసరానికి మించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదు.
*1. అసలు మనం ఉప్పు ఎందుకు తింటాం?*
ఉప్పులో సోడియం, క్లోరైడ్ అనే రెండు మూలకాలు ఉంటాయి. వీటిలో సోడియం మన శరీరానికి చాలా అవసరం.
మెదడు నుంచి కండరాలకు సంకేతాలు చేరడానికి, కండరాలు పనిచేయడానికి, గుండె సాధారణంగా కొట్టుకోవడానికి సోడియం కీలక పాత్ర పోషిస్తుంది.
నీటి సమతుల్యత: శరీరంలోని ద్రవాల పరిమాణం, సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. కణాలు సక్రమంగా పనిచేయడానికి, శరీరంలోని ద్రవాలు, ఆమ్ల-క్షార సమతుల్యతను నిర్వహించడానికి సోడియం అవసరం.
అయితే, అవసరమైన దానికంటే ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఫలెత్తుతాయి.
*2. రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి?*
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం, పెద్దలు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. అంటే సుమారు ఒక చిన్న టీ స్పూన్ కంటే తక్కువ.
ఇందులో వంటల్లో వేసే ఉప్పుతో పాటు, పెరుగు మజ్జిగలో వేసుకునే ఉప్పు, ప్యాకెట్ ఆహారాలు, బ్రెడ్, బిస్కెట్లు, చిప్స్, ఊరగాయలు, అప్పడాలు, సాస్లు వంటి పదార్థాల ద్వారా మనకు అందే ఉప్పును కూడా కలిపి లెక్కించాలి.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజుకు సగటున 9–12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారని WHO గతంలో ప్రచురించిన సమాచారం సూచిస్తోంది. ఇది సిఫార్సు చేసిన పరిమితికి దాదాపు రెండు రెట్లు!
*3. ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది?*
శరీరంలో సోడియం ఎక్కువగా చేరినప్పుడు, కొంతమందిలో శరీరం ద్రవాలను ఎక్కువగా నిల్వ ఉంచుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగవచ్చు.
అధిక రక్తపోటు రక్తనాళాలపై ఒత్తిడి పెంచుతుంది గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.: రక్తపోటు ఎక్కువగా ఉంటే, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అధిక సోడియం రక్తపోటును పెంచడం ద్వారా మూత్రపిండాల పనితీరుపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
అందుకే బీపీ ఉన్నవారే కాదు, బీపీ లేనివారు కూడా ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
*4. రోజువారీ జీవితంలో ఉప్పును తగ్గించడం ఎలా?*
వంటల్లో ఉప్పును క్రమంగా తగ్గించండి.
భోజనంలో అదనంగా పచ్చి ఉప్పు చల్లుకోవడం మానుకోండి.
ఊరగాయలు, అప్పడాలు, చిప్స్ వంటి ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోండి.
ప్యాకెట్ ఆహారాలపై ఉన్న పోషక విలువల వివరాలను చదివి, సోడియం తక్కువగా ఉన్న పదార్థాలను ఎంచుకోండి.
రుచికి నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఇతర సుగంధ ద్రవ్యాలను ఉపయోగించండి.
ఉప్పు వాడాల్సి వస్తే, అయోడిన్ కలిపిన ఉప్పును పరిమితంగా ఉపయోగించండి.
*ఉప్పును తగ్గించండి… రక్తపోటును అదుపులో ఉంచండి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి!*
డాక్టర్ ఎం. వి. రమణయ్య
