రాజమహేంద్రవరం, అక్టోబరు 6 (పున్నమి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంతోపాటు ఆరోగ్యం, పోషకాహారం, పారిశుధ్యం, జీవనశైలిపై అవగాహన కల్పించడమే విలేజ్ హెల్త్ క్లినిక్స్ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 267 క్లినిక్స్ ప్రారంభించామని, వచ్చే ఐదేళ్లలో 10 వేల క్లినిక్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనపర్తిలో రూ.80 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించినట్లు తెలిపారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, అనపర్తిలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ కోమలి, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు.




