పున్నమి తెలుగు దినపత్రిక: అమలాపురం, ఆగస్టు 15, 2026:
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవితో కలిసి స్వాతంత్ర్య సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పోలీసు కవాతు నుంచి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
10 కోట్ల మత్తు రహిత ప్రతిజ్ఞలు
దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా మిషన్ స్పందన్, బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “10 కోట్ల మత్తు రహిత ప్రతిజ్ఞలు” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వారి స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనేది కేవలం హక్కులను పొందడం మాత్రమే కాదని, దేశం పట్ల బాధ్యతలను నిర్వర్తించడం కూడా అని అన్నారు.దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, వైద్యం, మౌలిక వసతులు తదితర రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తోందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
వికసిత్ భారత్ @2047లో యువత కీలకం
వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, సాంకేతికత, స్టార్టప్‌లు, సామాజిక సేవ వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువశక్తి ప్రధానమైనదని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, నీటి సంరక్షణ, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో ప్రజలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. “దేశ అభివృద్ధి – మన బాధ్యత” అనే భావనతో ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి, ఐక్యత, సమైక్యతా స్ఫూర్తిని మరింతగా పెంపొందించుకుని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పరిపాలన అధికారి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పుర ప్రముఖులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పున్నమి దినపత్రిక రిపోర్టర్ : శివకృష్ట.పి



