పుస్తకాల సంరక్షణకు శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి చేయూత
ఆత్మకూరు, జూలై 15 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
విద్యాభివృద్ధికి, జ్ఞాన విస్తరణకు గ్రంథాలయాలు కేంద్రబిందువులని భావిస్తూ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఆత్మకూరులోని స్థానిక శాఖా గ్రంథాలయంలో పుస్తకాలను భద్రపరచడానికి సరైన ర్యాక్స్ లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన, గ్రంథాలయ నిర్వాహకుల విజ్ఞప్తికి వెంటనే స్పందించి రూ.40 వేల వ్యయంతో నాలుగు నాణ్యమైన స్టీల్ ర్యాక్స్‌ను విరాళంగా అందజేశారు.
గ్రంథాలయంలో పుస్తకాలు నేలపై, తాత్కాలిక ఏర్పాట్లలో ఉండటంతో అవి దెబ్బతింటున్నాయని, పాఠకులు ముఖ్యంగా విద్యార్థులు పుస్తకాలను సులభంగా పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్వాహకులు దాత దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కంచి పరమేశ్వర రెడ్డి ఆలస్యం చేయకుండా బుధవారం నాడు స్టీల్ ర్యాక్స్‌ను అందజేసి గ్రంథాలయ అభివృద్ధికి చేయూతనిచ్చారు.తెలుగు భారతి సేవా సమితి, సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అనంతరం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ స్టీల్ ర్యాక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, పుస్తకాలు భద్రంగా ఉండేందుకు, విద్యార్థులు సులభంగా వినియోగించుకునేందుకు ఈ ర్యాక్స్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం, జ్ఞాన సంపదను కాపాడే లక్ష్యంతో కంచి పరమేశ్వర రెడ్డి చేసిన ఈ సేవను గ్రంథాలయ ప్రతినిధులు, పాఠకులు, ప్రముఖులు అభినందించారు. గ్రంథాలయ ప్రతినిధులు గోవింద్ రెడ్డి, ఓ. శ్రీనివాసరాజు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సామాజిక సేవ రంగాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాన్నదానం, విద్యార్థులకు విద్యా సహాయం, పేద కుటుంబాలకు ఆర్థిక సాయం, గిరిజన విద్యార్థులకు రవాణా సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు గ్రంథాలయ అభివృద్ధికి కూడా ముందుకు రావడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు భారతి సేవా సమితి సభ్యులు, సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు, పట్టణ ప్రముఖులు పాల్గొని కంచి పరమేశ్వర రెడ్డి సేవలను కొనియాడారు. గ్రంథాలయాల అభివృద్ధికి సమాజంలోని దాతలు ముందుకు రావడం వల్ల విద్యా వాతావరణం మరింత బలోపేతం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.


