పెరుమాళ్లపాడు గ్రామంలో బయటపడ్డ పురాతన ఆలయం
(పున్నమి ప్రతినిధి)
రాజులు పోయారు… రాజ్యాలు పోయాయి. శిథిలాల క్రింద చారిత్రక అవశేషాలు చెక్కు చెదరకుండా నిక్షిప్తిమై ఉన్నాయి. చరిత్రకారులు, పురావస్తు శాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో అనేక విశేషాలు, చారిత్రక విశిష్టతలు వెలుగు చూస్తున్నాయి. నాటి నేటి జీవిన విధానానికి, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి చారిత్రక అవశేషాలు కలిగిన ఓ ఆలయాన్ని ఆ గ్రామస్తులు వెలికితీశారు. గ్రామానికి చెందిన పాతకాలపు పెద్దల ద్వారా విశిష్టతను తెలుసుకుని చేపట్టిన తవ్వకాల్లో ఓ ఆలయం బయటపడింది. ఇప్పుడది పెన్నా పరివాహకంలో అందరిని ఆకర్షిస్తోంది. శతాబ్దాల క్రితం నిర్మించిన ఆ ఆలయం ఎక్కడ బయటపడింది.. అందులో విశేషాలేంటి? ఆ ఆలయాన్ని నిర్మించింది ఎవరు? తెలుసుకుందాం.
పెరుమాళ్లపాడు గ్రామం, నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పవిత్ర పినాకిని నదీ తారాన దక్షిణం వైపున ఉన్నది. ప్రస్తుతం ఇక్కడ గ్రామానికి చెందిన కొందరు ఔత్సాహికులు మేటలు వేసిన ఇసుక తిన్నెలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అద్భుత ఆలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. పూర్తి స్థాయిలో గ్రామస్తులు ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. గత అయిదు రోజులుగా గ్రామస్తులు చేస్తున్న ఈ ప్రయత్నంలో మంగళవారం నాటికి ఆలయ ప్రాకారం, గర్భగుడి సహా వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం మూతపడడం, ఇసుక తిన్నెల్లో మునిగిపోవడం వెనుక ఓ కథ వుందని గ్రామస్తులు చెబుతున్నారు. పరశురాముడి హయాంలో పాపప్రక్షాళన కోసం చేపట్టిన ఈ నిర్మాణం అనేక విశిష్టతలను, ప్రత్యేకతలను కలిగివుంది. ఇంతకి ఈ ఆలయం ఇంతగా పూడిపోవడానికి కారణాలేంటి? అన్నది పరిశీలిస్తే
ఒకప్పుడు వరదలతో పరవళ్లు తొక్కే పెన్నా నదిలో ప్రస్తుత సోమశిలకు దిగువ భాగాన ఉన్న ఈ గ్రామానికి నది తాకిడి ఎక్కువగా వుండేది. వర్షా కాలంలో వరదలు, వేసవిలో ఇసుక తుఫానులను తలపించే ఇసుక మేటలు పెరుమాళ్లుపాడు గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. దాంతో సరిగ్గా 101 సంవత్సరాల క్రితం పెన్నానది గట్టు నుంచి కాస్త దూరంగా మెరక ప్రాంతానికి వెళ్లి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక శతాబ్దం పాటు వరదలు, ఇసుక మేటల కారణంగా పురాతన గ్రామంతో పాటు ఆలయం ఇసుక తిన్నెల్లో భూగర్భంలో కలిసిపోయింది. గ్రామంలో పెద్దలు, పాత తరానికి చెందిన వారు అప్పుడప్పుడు పాత గ్రామాన్ని గురించి చెబుతుండడం ఈ తరం యువకులను ఆకర్షిస్తూ వుండేది.
ఇటీవల కరోనా నేపథ్యంలో ఎక్కడెక్కడో వున్న గ్రామానికి చెందిన అనేక మంది యువకులు, పలువురు ప్రముఖులు పెరుమాళ్లుపాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రచ్చబండ వద్ద జరిగిన సమావేశాల్లో పాత గ్రామం ఆనవాళ్లు చూడాలని కొందరు కుతూహలం చూపారు. ఉబలాటపడ్డారు. పాత ఆనవాళ్లను వెలికితీయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అలా మొదలైన వారి ఆలోచన అయిదు రోజుల క్రితం ఆచరణకు శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లతో ఇసుక తిన్నెలను తొలగిస్తుండగా గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆలయం ఆనవాళ్లు ఉన్న ప్రాంతాన్ని చూపారు. దాంతో అక్కడ తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో ఈవాళ ఆ ఆలయం ఆనవాళ్లు బయటపడ్డాయి.
ఈ సందర్భంగా గ్రామస్తులుసమాచారం మేరకు ఎంతో చరిత్ర కలిగినటువంటి శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం వెలికితీసి గతంలో లాగే పూజలు నిర్వహించాలని వైభవంగా దేవాలయాన్ని తీర్చిదిద్దాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.