
*రైతులకు యూరియా కొరతను నివారించి, సరఫరా చేయాలి*
*జూలై 17 న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి*
*సీపీఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్*
ముత్తారం, జులై 15, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఉన్న రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని, కొరతను నివారించి సరపరా చేయాలని సీపీఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ ప్రభుత్వ అధికారులను కోరారు. మంగళవారం ముత్తారం మండల సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వర్షా కాలం ప్రారంభమై రైతులు తమ వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రైతులకు సరిపడా యూరియాను అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) పెద్దపల్లి జిల్లా మహాసభలు జూలై 17 న జిల్లా కేంద్రంలోని ఎస్ .ఎన్ గార్డెన్ లో జరుగుతాయని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆయన అన్నారు. సీపీఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ మహాసభలు నిర్వహించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకుని భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ జాతీయ సమితి నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17 న జరిగే జిల్లా మహాసభల్లో ముత్తారం మండల సీపీఐ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరౌతారని ఆయన అన్నారు.
ముత్తారం మండల సీపీఐ కార్యదర్శి కామ్రేడ్ గాదె సమ్మయ్య అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ నాయకులు అల్లం ఓదేలు, గుండ విజయ్ కుమార్, రేగుంట మహేశ్, గంధం రాజయ్య, ముంజ సతీష్, సి.హెచ్. రాజ్ కుమార్, ఎం.చంద్రమౌళి, నల్లి శంకర్, జి.గంగయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.