*మొంథా తుపాను పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి*
*జీరో క్యాజువాలిటీ ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
*శిథిల భవనాలు, గోడల విషయంలో ముందస్తు చర్యలు చేపట్టాలి
*హోర్డింగులు, విరగడానికి అవకాశం ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలి
*జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
*విశాఖపట్టణం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* ః మొంథా తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి దుర్ఘటన కూడా జరగడానికి వీలులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సైక్లోన్ జిల్లా ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఆదేశించారు. జీరో క్యాజువాలిటీ ఉండేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని, శిథిల భవనాలు, గోడలను ముందుగానే గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. విరిగి పడడానికి అవకాశం ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. గాలుల తీవ్రతకు హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉందని, ముందుగానే వాటిని కూడా తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, తుపానుకు ముందు ప్రజలను అప్రమత్తం చేయాలని, తర్వాత యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. మొంథా తుపాను నేపథ్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్ మీటింగు హాలులో ఆయన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తుపాను సన్నద్ధత, తక్షణ స్పందన, సహాయక చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రమాద నివారణకు, సహాయక చర్యలకు అనుగుణంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తుపాను తీరం దాటే దిశ మారొచ్చని, మంగళవారం ఉదయం నుంచి గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని, అధికారులు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని అజయ్ జైన్ పేర్కొన్నారు. మ్యాన్ హోల్స్ ను సరిచేయాలని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంత ప్రజలను రక్షిత భవనాలకు తరలించాలని సూచించారు. అక్కడ అవసరమైన మేరకు తాగునీరు, ఆహారం, చిన్నపిల్లలకు పాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా ట్యాంకులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణకు తక్షణ చర్యలు చేపట్టే విధంగా ప్రాంతాల వారీగా సిబ్బందిని, యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. ముందుగానే స్తంభాలను, తగిన యంత్రాలను ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా, జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. గ్రామాల్లో, అర్బన్ ప్రాంతాల్లో సోలార్ ల్యాంపులు, మొబైల్ ఛార్జింగ్ యూనిట్లను సమకూర్చాలని పేర్కొన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి అన్ని రకాల ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. నిర్మాణ దశలో ఉన్న భవనాల వద్ద కార్మికులను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. గాలుల తీవ్రతకు చెట్లు, కొమ్మలు పడిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కటింగ్ యంత్రాలను, జేసీబీలను, లారీలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని అజయ్ జైన్ సూచించారు.
*29న టిఫన్, భోజనం ప్యాకెట్లను సిద్దం చేసుకోవాలి*
గంటకు 150 నుంచి 200 కి.మీ. వేగంతో తుపాను 28వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో చాలా నష్టం వాటిల్ల వచ్చని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని అజయ్ జైన్ పేర్కొన్నారు. కావున 29వ తేదీ ఉదయం, మధ్యాహ్నం నష్టం వాటిల్లిన ప్రాంత ప్రజలకు, తుపాను ప్రభావిత ప్రాంత పౌరులకు అల్పాహారం, భోజనం ప్యాకెట్లను అందించేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మందులను కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. రహదారుల్లో చిక్కుకుపోయే వాహనదారులకు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో ఉండేపోయే ప్రయాణికులకు కూడా ఆహారం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. పడిపోయిన విద్యుత్ స్తంభాలను, దెబ్బతిన్న డ్రెయిన్లను డ్రోన్ల సహాయంతో గుర్తించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో ఆహార తయారీకి సంబంధించి ఏర్పాట్లు చేయాలని, ప్యాకెట్లను సిద్దంగా ఉంచుకోవాలని అజయ్ జైన్ అధికారులను ఆదేశించారు.
*జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ః జిల్లా కలెక్టర్*
సమావేశంలో భాగంగా మొంథా తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉన్నామన్నారు. తీర ప్రాంత ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశామని, మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు, ఆయా మండల కేంద్రాల్లో తుపాను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. గోస్తనీ నదీ తీరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందుగానే ప్రజలను అప్రమత్తం చేశామని, గంభీరం, మేఘాద్రిగెడ్డ జలాయాశాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. కొండవాలు ప్రాంతాల్లో సుమారు 12,755 ఇళ్లు ఉన్నాయని, వాటిల్లో 96 ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా, సంబంధిత నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. సైక్లోన్ షెల్టర్లు 20, పునరావాస కేంద్రాలు 23 ఉన్నాయని వాటిల్లో 9,290 మందిని ఉంచడానికి వీలుగా ఏర్పాట్లు చేశామని, అక్కడ అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ పరిధిలని ఆరు సర్కిళ్లలో అవసరాలకు తగిన విధంగా బియ్యం నిల్వలను ఉంచామని, ఎఫ్.పి. దుకాణాలకు తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. టెలీ కమ్యూనికేషన్ సంస్థల ప్రతినిధులను, ఎల్పీజీ పంపిణీదారులను అప్రమత్తం చేశామని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 430 బృందాలు ఉన్నాయని, జేసీబీలు, లారీలు, కటింగ్ యంత్రాలు, పోల్ బిల్డింగ్ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇవికాకుండా నేవీ, కోస్ట్ గార్డు అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. సముద్ర తీరంలో ఆరు మెకనైజడ్ బోట్లను, నేవీ, కోస్ట్ గార్డ్ పరిధిలో హెలిక్యాప్టర్లను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ చెప్పారు.
*జీవీఎంసీ పరిధిలో ముమ్మర ఏర్పాట్లు*
జిల్లా యంత్రాంగంతో కలిసి అదనంగా 38 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 20 క్యూ.ఆర్.టి. (క్విక్ రెస్పాన్స్ టీమ్స్) బృందాలను నియమించామని, ఒక్కో జోన్ పరిధిలో రెండేసి బృందాలు ఉంటాయని చెప్పారు. ప్రతి బృందం జేసీబీ, ట్రిప్పర్, ట్రాక్టర్, ట్రీ కట్టర్, బెయిలింగ్ మెషిన్ కలిగి ఉంటాయని వివరించారు. ఈ విధంగా 29 జేసీబీలు, 82 స్ప్రెయిర్స్, 64 ఫాగింగ్ మెషీన్లు, 26 పవర్ రంపాలు, 2 శక్తిమాన్లు, 15 జనరేటర్లు, 108 కమ్యూనికేషన్ పరికరాలను, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుకున్నామని జీవీఎంసీ కమిషనర్ పేర్కొన్నారు.


