*మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం*
మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ మీడియట్ 2025 – 2026 మొదటి విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నెల 31 తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇదివరకే దరఖాస్తు సమర్పించిన విద్యార్థులు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చునని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.
విద్యార్థులు తమ అన్ని అర్హతలను తెలియజేసే సర్టిఫికెట్లతో ఈ నెల 31 తేదీన ఉదయం 9 గంటలకు తమకు అడ్మిషన్ కావాల్సిన గురుకుల జూనియర్ కళాశాలలో హాజరుకావాలని ఆయన వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థుల దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మెరిట్ లిస్టు ప్రకటించి, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అడ్మిషన్లన్నీ రిజర్వేషన్ ప్రకారం, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన కేటాయించబడతాయన్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హతలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2025 సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలనీ, విద్యార్థులు తమ స్వంత జిల్లా/ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలనీ, పదవ తరగతి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, పదవ తరగతి మార్కుల మెమో, అవసరమైన సర్టిఫికెట్ లన్ని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలని తెలిపారు.
దరఖాస్తు చేసుకొనే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ. 1,50,000 మించకూడదనీ, ఇందుకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని 2025 జనవరి 1 వ తేదీన లేదా అంతకుముందు తేదీలో తహశీల్దార్ జారీ చేయాలనీ, విద్యార్థుల వయస్సు 2025 ఆగస్టు 31 తేదీ నాటికి 17 సంవత్సరాలు మించకూడదనీ, ఈ విషయంలో ఎస్సీ విద్యార్థులందరికీ ఒక సంవత్సరం సడలింపు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.