
విశాఖపట్నం, అక్టోబర్ 4:
మహా విశాఖ నగరంలోని బీచ్ తీర ప్రాంతాన్ని పరిశుభ్రతతో అందంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బీచ్‌లో కాలువల ద్వారా వ్యర్థాలు కలవకుండా తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ వేదికగా పార్ట్నర్షిప్ సమ్మిట్, ఐఎఫ్‌ఆర్ త్వరలో జరగనున్న నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి అతిథులు, పర్యాటకులు నగరానికి రానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, బీచ్ తీర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరమని అన్నారు.
నగరంలోని ప్రధాన కాలువల ద్వారా వ్యర్థాలు బీచ్‌లో చేరుతున్నాయని గుర్తించిన కమిషనర్, వాటిని అడ్డుకునేందుకు కాలువల వద్ద ఆధునిక వలలు, స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాన ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజును ఆదేశించారు.
అలాగే బీచ్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్య పర్యవేక్షణ జరపాలని, జోనల్ కమిషనర్లు పరిశుభ్రత చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి డా. ఈ.ఎన్.వి. నరేష్ కుమార్, డీటిహెచ్‌ఎం దామోదర్ రావు, పర్యవేక్షక ఇంజనీర్లు పల్లమరాజు, శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్లు కనకమహాలక్ష్మి, శివప్రసాద్, మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజనీర్లు ఏడుకొండలు, గంగాధర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

