*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 రూపాయల 50 పైసలకు ఇటుక సరఫరా*
*_ధర నిర్ణయంపై ప్రకటన విడుదల చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_*
పెద్దపల్లి, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు ఇటుక బట్టీల యాజమానులు నిర్ణయించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటుక బట్టీల యాజమానులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల నుంచి తక్కువ ధరకు ఇటుక సరఫరా చేయాలని వారిని ఒప్పించడం జరిగింది. మొదటి విడత కింద పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం 9 వేల 421 ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు చేయగా ఇప్పటివరకు 6 వేల 18 ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసామని, 3 వేల 847 గృహాలకు మార్కింగ్ చేసి బేస్మెంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 12, 000 ఇటుకల అవసరం అవుతాయని, ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల యాజమాన్యుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి, శ్రీరాంపూర్, పాలకుర్తి, కమాన్ పూర్ మండలాల్లోని లబ్ధిదారులకు పెద్దపల్లి మండలంలో తయారు చేసిన ఇటుక బట్టీల నుంచి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని లబ్ధిదారులకు సుల్తానాబాద్ మండలంలో తయారుచేసిన ఇటుక బట్టీల నుంచి సరఫరా అవుతుందని అన్నారు. ధర్మారం మండలంలోని ఇటుక బట్టీలు ధర్మారం మండలానికి, రామగిరి, రామగుండం మండలాల్లో తయారు అయ్యే ఇటుక బట్టీల నుంచి రామగిరి, మంథని ముత్తారం, మంథని మండలాలకు ఇటుకల సరఫరా అవుతాయని కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం అవసరమైన ఇటుకలను ప్రతి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ద్వారా ఒకేసారి లిఫ్ట్ చేయుటకు వాహన సంఖ్యతో పర్మిట్ లెటర్ ఎంపీడీవో ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను పూర్తి స్థాయిలో త్వరగా నిర్మించుకోవాలని, ఈ ప్రక్రియను పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి, పిడి హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


