ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ ఆత్రేయపురం
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం తిరుమల వాడపల్లి దేవాలయంలో ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపట్టారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, కమిషనర్ క్యాడర్లో ఉన్న ఆలయ ప్రాంగణాలను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్న దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు డీసీ క్యాడర్లో ఉన్న వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీకారం చుట్టారు.
నిత్యం రద్దీ ఇలా..
ఆలయంలో శనివారం 10 వేల నుంచి 15 వేల వరకు, మిగతా రోజుల్లో నిత్యం 3 వేల నుంచి 5 వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తుంటారు. వీరికి గతంలో ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు వడ్డించేవారు. ప్రస్తుతం స్టీల్ కంచంలో అరటి ఆకులను వేసి అన్నప్రసాదం పెడుతున్నారు. త్వరలో పూర్తిగా అరటి ఆకులు వినియోగించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు అరటి ఆకు, కుట్టుడు ఆకుతో తయారుచేసిన కప్పుల్లో ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలను కాగితం సంచుల్లో అందజేస్తున్నారు.
దుకాణదారులకు నోటీసులు..: నల్లం సూర్యచక్రధరరావు, ఈవో
ఆలయ సమీపంలోని దుకాణాల్లో పాలిథిన్ సంచులు విక్రయించరాదని వ్యాపారులకు నోటీసులు అందజేశాం. తహసీల్దార్ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాం. దేవస్థానంలో ప్లాస్టిక్ రహిత వస్తువులను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్ కవర్లు తీసుకురావద్దని భక్తులను కోరుతున్నాం. ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నట్లు బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. క్షేత్రంలో మైక్లో ప్రచారం చేస్తున్నాం.


