స్వాతంత్ర్య సమరంలో పాల్గొని
దేశానికి స్వేచ్ఛా వాయువులనిచ్చిన
వీరనాయకుల గాధలు విరివిగా విన్నాము
కోరుకున్న లక్ష్యాన్ని పోరాడి సాధించి
విజయాన్ని చేరుకున్న ధీరుల గాధలు
చిన్ననాటి నుండి కనులారా చదివాము
రక్తాన్ని ఉడికెత్తించే పౌరుష సంవాదనలు
దేశభక్తిని మేల్కొలిపే జవానుల వీరోచితాలు
విజయసింహాసనాన్ని అధిరోహించిన సాహసాలుఎన్నెన్నో చూసాము.
ఎందరో ప్రజలను పొట్టనబెట్టుకున్న
జలియన్ వాలాబాగ్ వంటి ఉందంతాలెన్నింటినో విని
కన్నీళ్ళు కార్చిన మనమే
ఏకతాటిపైకి వచ్చి వీడని సంకల్పంతో
శత్రువుల దురాగతాలను తరిమితరిమి కొట్టాము.
అవన్నీ ….
ఎవరో తాతలు చెప్పగా విన్న గాథలు
ఎక్కడో పుస్తకాలలో చదవగా తెలిసిన సంఘటనలు
ఎప్పుడో నాటకాలలో చూడగా కలిగిన అనుభూతులు
ఇప్పుడు నిజంగా …
ఒక అలుపెరుగని యుద్ధం మన ముందుకొచ్చింది.
ప్రతి ఒక్కరూ పోరాడే ఆవశ్యకత ముంచుకొచ్చింది.
పోరాటాల పురిటి గడ్డ మనది.
వెనుదిరగని స్వభావం మనది.
రెప్పపాటు కాలంలో తెలియని శత్రువొకటి
ప్రపంచం మీదకి దండయాత్రకొచ్చింది
గొప్పవాళ్ళమంటూ తరచుగా జబ్బలుచరచుకునే దేశాలన్నీ
జబ్బులతో బెంబేలెత్తి శ్మశానవాటికలయ్యాయి.
మన చక్కని సాంప్రదాయాలు సంస్కృతి
ఏళ్ళతరబడి అనుసరిస్తున్న ఆరోగ్యసూత్రాలు
యోగాసనాలు ప్రకృతి వైద్యాలు
ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి..
విదేశాలనుండి సులువుగా ప్రవేశించిన భూతం
మన కట్టుదిట్టాలను చూసి బిత్తరపోయింది.
తిండిలేక నిదురలేక త్రాగుటకు నీరులేక
ఎన్నెన్ని అవస్థలు పడుతున్నా సరే
కరోనా భూతాన్ని పారద్రోలందే విశ్రమించమన్న
మన దృఢ సంకల్పాన్ని చూసి
స్వీయ నిర్భంధానికి స్వచ్చందంగా వెళుతూ
స్వీయ సంరక్షణ పాటిస్తున్న
ప్రజల సంకల్ప బలాన్ని చూసి
ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా
వెనుకడుగు వేయని ప్రజల మానసిక స్థైర్యం చూసి
కరోనా బూచి సాగిలపడి బూడిద అవుతోంది
క్రమ క్రమంగా బలహీన పడుతోంది
ఓరిమితో ఐక్యతతో మనం చేస్తున్న
స్వచ్ఛంద గృహనిర్బంధ పోరాటాన్ని చూసి
కరోనా దహించుకు పోతుంది
క్రమేణా క్రుంగి కృశించి పోతుంది
అంతవరకూ….
మన తరగని ఆత్మవిశ్వాసమే మన ఆయుధం
ఆరోగ్య సూచనలు పాటించడమే తక్షణ కర్తవ్యం.
మనల్ని మనం కాపాడుకుందాం
మనవారినందరినీ కాపాడుకుందాం
రండి ..
గెలిచేందుకు పోరాడుదాం
గెలిచేవరకూ పోరాడుదాం
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918
bhramarambaganjam22@gmail.com