వంట నూనెలు అధికంగా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు
.. ఇప్పటివరకు 146 కేసులు నమోదు
జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
నెల్లూరు జిల్లాలో పలు దుకాణాల్లో వంట నూనెలు అధిక ధరలకు విక్రయించడంతో పాటు ఇతర నిబంధనలు ఉల్లంఘించినందులకు 146 కేసులు నమోదు చేసి 31 కేసులకు సంబంధించి 3,47,000 రూపాయల అపరాధ రుసుము వసూలు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల కాలంలో వంటనూనెల ధరలు పెరగడంతో వాటిని నియంత్రించేందు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాలు, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ, తూనికలు కొలతల శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ బృందాలు జిల్లాలో విస్తృతంగా హోల్ సేల్, రీటైల్ వ్యాపార సంస్థలు, దుకాణాలను తనిఖీ చేశారన్నారు.
జిల్లాలో అక్రమంగా నిల్వ ఉన్న 2767 క్వింటాళ్ల వివిధ రకాల నూనెల స్టాకులను సీజ్ చేయడం జరిగిందన్నారు. దీంతో చాలా వరకు వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. జిల్లాలో వంట నూనెలు అధిక ధరలకు అమ్మినా, అక్రమ నిల్వలు ఉంచిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నెల్లూరు, కావలి, గూడూరు పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు 135 రూపాయలకే వంట నూనెలు విక్రయించడం జరుగుతోందన్నారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేట, నవాబుపేట రైతుబజార్లతో పాటు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కావలి, గూడూరు లోని రైతు బజార్ల లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వంట నూనెలు 135 రూపాయలకే విక్రయించడం జరుగుతోందన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ————————–