గూడలి కోట మండలం ఏప్రిల్ ( పున్నమి ప్రతినిధి )
శతాబ్దాల సాంస్కృతిక చరిత్రకు, వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా, అద్భుత శిల్పకళా సంపద ఈ ఆలయం సొంతం. స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శైవ క్షేత్రాల్లో ప్రత్యేకత సంతరించుకున్న కోట మండలం గూడలిలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం చోళరాజుల చరిత్రకు నిదర్శనం. ఈ నెల 5వ తేదీ నుంచి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గూడలిలోని సంగమేశ్వరస్వామి ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. తైత్రా యుగమున ఆగస్త్య మహాముని కాశీ నుంచి కన్యాకుమారికి వెళుతూ మార్గమధ్యమున శివపూజకు వేళయినందున స్వర్ణముఖి నది కూడలి వద్ద తన రుద్రాక్ష మాలను ఉంచి శివుని ప్రార్ధించడం వలన ఆ రుద్రాక్ష మాల లింగరూపమును దాల్చిందని చరిత్ర చెబుతుంది. 12వ శతాబ్ధంలో చోళరాజు కళింగతుంగ చోళుడు వేటకు వచ్చి కాంతులీనుతున్న రుద్రాక్ష లింగాన్ని పూజించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం తెలుపుతుంది. స్వర్ణముఖి నది మూడు పాయలుగా చీలిపోవడంతో కూడలి ప్రాంతం గూడలిగా మారినట్లు చరిత్ర చెబుతుంది. సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. సంతానం లేని మహిళలు బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ రోజు కొడి వస్త్రాన్ని కట్టుకుని కొడి ముద్దలు భక్తిభావంతో స్వీకరిస్తే సంతానం కలుగుతుందని చెప్తున్నారు. అదే సమయంలో స్వామివారి కల్యాణంతో పాటు అనేక జంటలు ఆలయ ప్రాంగణంలో వివాహాలు చేసుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
ఉత్సవాల వివరాలు :
——————-
ఈ నెల 5వ తేదీన అంకురార్పణ, గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 6న ధ్వజారోహణ, కొడి వస్త్రాలు, 7న శేష వాహనసేవ, 8న హంసవాహన సేవ, 9న బృంగిసేవ, 10న రావణ సేవ, 11న నందిసేవ, 12న రథోత్సవం, 13న గజవాహన గ్రామోత్సవం, 14న స్వామివారి కల్యాణం, 15న ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొంటారని ఆలయ నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పల్లెముల్లు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ ఏఓ పెంచల వర ప్రసాద్ తెలిపారు.


