
జైల్ రోడ్లో ఉన్న ఫుడ్ కోర్ట్‌ను జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానంతో తొలగించిన విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు స్పందిస్తూ, “ఆంధ్ర యూనివర్సిటీ సత్రం కాదు. ఇది చదువుల తల్లి ఉండే పవిత్ర దేవాలయం. వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం అనేది విద్యా వాతావరణాన్ని కలుషితం చేయడమే” అని అన్నారు.
ఫుడ్ కోర్ట్ తొలగింపు నిర్ణయం అనూహ్యంగా తీసుకోలేదని, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకే చర్యలు చేపట్టినట్లు జీవీఎంసీ కమిషనర్ తెలిపారు అని స్ట్రీట్ వెండర్లకు చట్టపరమైన రక్షణలు ఉన్నాయని, వాటి ప్రకారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు అని అన్నారు
ఈ పరిణామంలో కొంతమంది రాజకీయ నాయకులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో స్థలం కేటాయించాలని చేసిన డిమాండ్లను ఆరేటి మహేష్ బాబు తీవ్రంగా విమర్శించారు.
“శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ విశ్వవిద్యాలయం ఎంతోమంది పేద విద్యార్థులకు భవిష్యత్తునిచ్చిన విద్యాలయం. ఇక్కడ వ్యాపారానికి అనుమతిస్తే, పవిత్ర వాతావరణం కలుషితం అవుతుంది. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం” అని ఆయన స్పష్టం చేశారు.
“ఆంధ్ర విశ్వవిద్యాలయం మన వారసత్వ సంపద. అక్కడ చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగిన వారికే ఆ నేల విలువ బాగా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఇలాంటి డిమాండ్లు చేయకుండా, యూనివర్సిటీ పరిరక్షణలో భాగస్వాములుగా ఉండాలి. అధికారులు కూడా రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా విద్యా వాతావరణాన్ని కాపాడే నిర్ణయాలు తీసుకోవాలి” అని ఆరేటి మహేష్ బాబు పిలుపునిచ్చారు.

