ఆర్ సి పురంలో బడి పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం
పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ఏపీ ఎంఎస్ఎమ్ఈ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ చినబాబు, సింగల్ విండో చైర్మన్ జనార్దన్ చౌదరి అన్నారు. గురువారం స్థానిక కమ్మకండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తుంది ఇంటింటి ప్రచార రథాన్ని డిప్యూటీ డీఈవో ఇందిరా దేవి తో కలసి వారు ప్రారంభించారు ఈ సందర్భంగా సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం రామచంద్రాపురం కూడలి వరకు ర్యాలీ చేశారు. వారు మాట్లాడుతూ సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన టీచర్స్ నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. పేద మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ మోజులో పడి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు తల్లిదండ్రులు విజ్ఞతతో ఆలోచించి సర్కారు బడుల్లోనే తమ పిల్లలను చేర్పించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల్లో ఒత్తిడి లేని విద్యతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎంఓ చంద్రశేఖర్ నాయుడు, జిసిడివో పుష్ప, ఎంఈఓ లు మార్కొండయ్య నాయుడు, జయ వేలు, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిఆర్ఎంటిలు, అంగన్వాడి టీచర్స్, ఎంఈఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




