విశాఖ ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి):
విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష,మిలన్–2026 మహాసమ్మేళనాల సందర్భంగా ఈనెల 16నుంచి 19వరకు ఆర్కే బీచ్ రహదారిలో రవాణా ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు.మధ్యాహ్నం ఒకటిగంట నుంచి రాత్రి తొమ్మిదిగంటల వరకు అనుమతి పత్రాలు లేని వాహనాలకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.భద్రతా కారణాల దృష్ట్యా సముద్రతీర ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. సాధారణ ప్రజలు తమ వాహనాలను ఎంజీఎం గ్రౌండ్స్, ఆంధ్రయూనివర్సిటీ గ్రౌండ్స్ లేదా జిల్లా పరిషత్ ఆఫీస్ వద్ద నిలిపివేసి అక్కడి నుంచి కాలినడకన కార్యక్రమ ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు.భారీ వాహనాల రాకపోకలపై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు తెలిపారు.ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని,అధికారుల సూచనలు పాటించాలని కోరారు.నగర పోలీసు కమిషనర్ ప్రజలు సహనంతో వ్యవహరించి భద్రతా సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.



