తాళ్లపూడి,పున్నమి ప్రతినిధి ఫిబ్రవరి 12:
తాళ్లపూడి మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం (త్రిబుల్ రైడ్), అలాగే మైనర్లు వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై టి. రామకృష్ణ యువ ప్రెస్ టీం సభ్యులకు తెలిపారు.
ఈ సందర్భంగా తాళ్లపూడి మార్కెట్ ప్రాంతంలో దుకాణాల ఎదుట అడ్డగోలు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకుండా భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 30 రోజుల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు.
ఇటీవల తాళ్లపూడి బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ మైనర్ యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. అదనంగా, అధిక లోడుతో వాహనాలు నడిపితే రూ.20,000 వరకు జరిమానా విధిస్తామని చెప్పారు.
హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకపోవడం, త్రిబుల్ రైడ్, మద్యం సేవించడం వంటి కేసుల్లో రూ.1,000 నుండి రూ.10,000 వరకు జరిమానాలు విధించబడతాయని ఎస్సై రామకృష్ణ స్పష్టం చేశారు.
ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



