ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):
చింతకాని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చింతకాని మండల బీజేపీ అధ్యక్షుడు కొండా గోపి నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా గోపి మాట్లాడుతూ పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యపై స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక అంబులెన్స్ లేకపోవడంతో మండల ప్రజలు అత్యవసర వైద్య సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వంత నియోజకవర్గంలోనే చింతకాని మండలానికి ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో చింతకాని మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, కోరిపల్లి శ్రీను, సిద్ధార్థ బక్క సత్యమూర్తి, సత్తెనపల్లి గోపి, గోపాల్ కృష్ణ, వేముల ఎల్లయ్య, దొడ్డా రామకృష్ణ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.



