విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి)
గాజువాక నియోజకవర్గంలో పార్కులు, చెరువుల సుందరీకరణకు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ నిధులతో రూ.కోటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అమరావతిలోని ఏపీ సీఆర్డీఏ భవనంలో జరిగిన ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, ఎండీ శ్రీనివాసులు, బోర్డ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్ర సుందరీకరణలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. బోర్డ్ సభ్యులు చేసిన సలహాలు, సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మొల్లి పెంటిరాజు మంత్రి నారాయణకు వినతిపత్రం అందజేసి, గాజువాక నియోజకవర్గంలో పార్కులు, చెరువుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి, రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని, తగిన ప్రతిపాదనలు త్వరగా పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ హామీపై మొల్లి పెంటిరాజు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఇతర బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు.




