కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు !
ఈ ఆర్టికల్ క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యం గా మేనేజిమెంటు వారి కోసం , పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయి లో ఉన్న మేనేజర్ ల కోసం రాయబడింది.
ముఖ్యం గా, శెలవు మంజూరు చేసే , లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం .
సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్ వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోం ) సమూలం గా మార్చి వేసింది .
ఉద్యోగినీ ఉద్యోగులు , పై స్థాయి మేనేజర్ ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది . కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బ తిన్నాయి .
సెలవు దొరకడం అత్యంత కష్టమైన , అత్యవసర సర్విసుల లో ( ప్రభుత్వ మరియు ప్రైవేటు ) పని చేసే కొందరు మిత్రులతో మాట్లాడుతూ నే ఉన్నాను . ” మీ దగ్గర శెలవు దొరకడం కష్టం కదా ? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ? ” అని .
మీరు ఒక కంపెనీ ని నడుపుతూ ఉంటే, లేదా మీరు పర్యవేక్షక / లేదా పై స్థాయి లో పని చేసే సీనియర్ అధికారి ( ణి ) అయితే, మా వైపు నుంచి కొన్ని విజ్ఞప్తులు !
(1) కుటుంబ సభ్యులని కోల్పోయిన ఉద్యోగులు దుఃఖం తో ఉంటారు . దశదిన కర్మ కంటే ఎక్కువ రోజులు, వారు మానసికం గా కోలుకునే వరకూ జీతం కూడిన లీవు ఇవ్వండి .
(2) వారు శెలవు లో ఉన్నప్పుడు, రెండు మూడు సార్లు ఫోన్ చెయ్యండి . ఏమైనా సహాయం కావాలా అడగండి . ఇల్లు దగ్గర ఉంటే ఒకసారి పర్సనల్ గా వెళ్ళి పరామర్శించండి . డబ్బు సాయం, ఆఫీసు నుంచి అడ్వాన్సు ఇప్పించడం , ఏవైనా ఆఫీసుల నుంచి నింపవలసిన దస్తావేజులు ఉంటే వాటిని తెప్పించి ఇవ్వడం, ఇలా ఏదైనా ?
(3) ఎవరెవరు చనిపోతే జీతం తో కూడిన లీవు ఇవ్వాలి ? ఈ కరోనా సమయం లో ఇది సంక్లిష్టమైన ప్రశ్న . కేవలం కుటుంబానికే పరిమితం చేయకండి!
(4) మనమందరం ఎన్నో సంఘటనలు చూశాం , చదివాం . మన లొకాలిటీ లో ఎవరో వృద్ధులు కరోనా బారిన పడి చనిపోతారు . వారి పిల్లలు పెళ్ళయి , ఇక్కడ లేక పోవచ్చు . ఈ దేశం లో నే లేక పోవచ్చు. వారు వచ్చే దాకా , చుట్టు పక్కల వారు, ఫ్యామిలీ ఫ్రండ్స్ , ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు . శవాన్ని ఐస్ బాక్సు లో ఉంచడం లాంటివి . అందరూ ఉండి, ఆపత్కాలం లో ఎవరూ లేని అనాధలు గా చనిపోయే దయనీయ స్థితులను గత సంవత్సర కాలం గా ఎన్నో చూశాం .
కాబట్టి, కేవలం భార్య / భర్త / పిల్లలు / తల్లిదండ్రులే కాక , అత్త, పిన్ని, బాబాయి, మామయ్య ,చుట్టాలు, పక్కాలు, ఇలా ఎవరు హఠాత్తు గా గతించినా, మీ ఉద్యోగులలో ఒకరు ఆ కారణం గా లీవు అడిగినా, ఈ విపత్కర సమయం లో కాదనకండి , కాస్త పెద్ద మనసు చేసుకుని , మంజూరు చేయండి . ఏమి జరుగుతోందో , కనిపెట్టి ఉండి , కనుక్కోండి.
(5) మీకు వాస్తవం తెలిస్తే, మీ ఉద్యోగి ( ని ) మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేటు , శ్మశానం నుంచి పత్రం , లేక డాక్టర్ సర్టిఫికేటు, అలాంటివి అడగకండి . మరీ తప్పని సరి అయితే తప్ప , ఇలాంటి దస్తావేజులు లేకుండానే లీవు అప్రూవ్ అయేలా చూడండి .
(6) మీ సంస్థ , ఎవరైనా సైకాలజిస్టు తో వ్యాపార ఒప్పందం అయి ఉందా ? విపరీమైన మానసిక వత్తిడి ఉండి, పని లో లీనం కాలేక పోతున్న ఉద్యోగులకు కాస్త కౌన్సెలింగ్ ఇప్పించండి . కంపెనీ ఖర్చు తో . ఆ సమయం లో అది వారికి అవసరం కావచ్చు .